భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 543 స్థానాల లోక్‌సభలో ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అమిత్‌షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి, సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సుర స్వరాజ్ న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు.
34 మంది కేంద్ర మంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేతలు ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే విడుదల చేశారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 195 స్థానాలకు అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఖరారు చేసినట్టు తావడే తెలిపారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతి ఇరానీ అమేధీ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, మనోజ్ తివారీ, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్‌లోని పోర్బందర్ నుంచి పోటీ చేయనున్నారు.
మరో మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి, ఆల్వార్ నుంచి రాజ్యసభ ఎంపీ భూపెందర్ యాదవ్, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు పోటీ చేస్తున్నారు. తిరువనంతపురం నుంచి రాజ్యసభ సభ్యుడు, మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విధిష లోక్‌సభ సీటు కేటాయించారు.
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువకులు, 18 గిరిజన తెగల అభ్యర్థులు ఉన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి 26 మంది అభ్యర్థులను ప్రకటించగా, మధ్యప్రదేశ్ నుంచి 24 స్థానాలు, గుజరాత్ నుంచి 15 స్థానాలు, రాజస్థాన్-15, కేరళ-12, తెలంగాణ-9 మంది, ఢిల్లీ-5, జమ్మూ-2, ఉత్తరాఖండ్-2, గోవా-1, త్రిపుర-1, అండమాన్ 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఎన్డీయేకు 400 సీట్ల లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందని, బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని ఈ సందర్భంగా తావడే, అర్జున్ పాండే ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.