పాలస్తీనాలోని గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆకలితో ఎదురుచూస్తున్న గాజాలోని అమాయక ప్రజలకు సాయం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది.
విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తామని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గాజాలోని అమాయక ప్రజలకు సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు. సముద్ర మార్గాన పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.
ఆహార ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా గాజాలో ఎయిడ్ డ్రాప్ చేయనున్నట్లు బైడెన్ తెలిపారు. కాగా, పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. నబుల్సి రౌండ్అబౌట్ వద్ద సహాయ సామగ్రి లారీల కోసం వేచి ఉన్న ప్రజలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడికి పాల్పడింది.
ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 300 మంది గాయపడ్డారు. మరోవైపు గాజాలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో 30,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. శిథిలాల్లో వేలాది మంది సజీవ సమాధి అయ్యారు.