బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొంటూ ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులారా..నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు’ అంటూ మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఇది ఎన్నికల సభ కాదని, ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదని చెబుతూ వికసిత్ భారత్ కోసం ఇక్కడకు ఇంత మంది రావటం సంతోషంగా ఉందని చెప్పారు.
దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టామని, బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని ప్రధాని తెలిపారు. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించినట్లు మోదీ వెల్లడించారు. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వికసిత్ భారత్‌పై ఆదివారం మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు.
బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ కుటుంబ పార్టీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కుటుంబ పార్టీలో రెండే అంశాలు ఉంటాయని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఒకటి దోచుకోవడం, రెండోది అబద్ధాలు చెప్పడం .. ఆ రెండే కుటుంబ పార్టీల సిద్ధాంతాలని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగింది అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. తన జీవితం తెరచిన పుస్తకమని.. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని పేర్కొన్నారు. తన ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో ప్రజల ముందుకు వచ్చినట్లు చెప్పారు.
ఆదీవాసీ సమాజం కోసం బీజేపీ కృషి చేస్తుందని.. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెబుతూ మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా నెరవేరుతుందని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే తమ లక్ష్యమని తెలిపారు.
రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా ఏడు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని తెలిపారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.