లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్‌బరేలీ నియోకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇక రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి బరిలో దిగనున్నారు.
రాహుల్ అమేథీ నుండి పోటీ చేయనున్నారని, దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని యుపి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమై.. ఇటీవల తిరిగి యుపి చేరుకున్న ప్రదీప్ సింఘాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్.. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు రాహుల్. అయితే ఇప్పుడు కూడా రాహుల్ అమేథీతో పాటు వయనాడ్ నుంచి కూడా పోటీ చేయనున్నారు.
ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి సోనియా ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ నుంచి ఇందిరా గాంధీ కూడా పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక ఈ ఎన్నికల్లో పోటీ చేసి నానమ్మ, తల్లి విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. సోనియా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.ఇక రాయ్‌బరేలీ పిలుస్తోంది అంటూ ప్రియాంక ఫొటోతో కూడిన పోస్టర్లు, కటౌట్లు ఆ నియోజకవర్గంలో దర్శనమిచ్చాయి. ప్రియాంక గాంధీ జీ.. ప్లీజ్ కమ్ అంటూ మద్దతుదారులు రాశారు.
రాయ్‌బరేలీలో 2019 ఎన్నికల్లో సోనియాపై బీజేపీ నాయకుడు దినేశ్ ప్రతాప్ సింగ్ పోటీ చేసి ఓడిపోయారు. 1.8 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఫైనల్ కాలేదు.