బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా ప్రసంగాన్ని అడ్డుకున్నారన్న కారణంపై ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల నుంచి నిరవధికంగా ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
సస్పెన్షన్కు గురైన ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలు మోహన్ సింగ్ బిష్త్, అజయ్ మహావర్, ఓపి శర్మ, అభయ్ వర్మ, అనిల్ బాజ్పాయి, జితేంద్ర మహాజన్, విజేందర్ గుప్తా తమ సస్పెన్షన్ను సవాలు చేస్తూ గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ రిట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తెలిపారు. సభా హక్కుల కమిటీ ఎదుట జరుగుతున్న విచారణ పూర్తయ్యేవరకు తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బిజెపి ఎమ్మెల్యేలు సవాలు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని వారు వాదించారు.
కాగా..ఎమ్మెల్యేల సస్పెన్షన్ సభలో అసమ్మతిని అణచివేత ప్రయత్నంగా భావించరాదని, ఇది ప్రతిపక్ష సభ్యుల దుష్ప్రవర్తన కట్టడికి తీసుకున్న స్వీయ క్రమశిక్షణా యంత్రాం చర్యగా చూడాలని అసెంబ్లీ అధికారులు కోర్టుకు తెలిపారు.
ఫిబ్రవరి 15న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా లెఫ్టినెంట్ గతవర్నర్ సక్సేనా ప్రసంగాన్ని బిజెపి ఎమ్మెల్యేలు పదేపదే అడ్డుకున్నారు. ఏడుగురు బిజెపి సభ్యుల సస్పెన్షన్ కోసం ఆప్ సభ్యుడు దిలీప్ పాండే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ రాం నివాస్ గోయల్ దాన్ని ఆమోదించారు.
అంతేగాక ఈ బిజెపి ఎమ్మెల్యే ప్రవర్తనను సభా హక్కుల కమిటీకి కూడా స్పీకర్ నివేదించారు. ప్రతిపక్ష నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి మినహాయించి మిగిలిన బిజెపి సభ్యులందరూ సభలోకి రాకుండా స్పీకర్ వేటు వేశారు. బడ్జెట్ తయారీలో ఆలస్యం కారణంగా అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటివారం వరకు సాగాయి.