బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బిజెపి, జెడియు నేతల మధ్య సోషల్ మీడియాలో `వార్’ తీవ్రమవుతున్నది. పరస్పరం తీవ్రమైన ఆరోపణలకు దిగుతున్నారు. దానితో సహనం కోల్పోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ హద్దుల్లో ఉండాలని, లేకుంటే కూటమి మధ్య విబేధాలు తప్పవంటూ హెచ్చరించారు.
74 : 45 సీట్ల భాగస్వామ్యంతో బీహార్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో తమకన్నా ఒక సీట్ తక్కువున్నా ఎన్నికల ముందు చేసిన ప్రకటనను గౌరవించి ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్ కే అప్పచెప్పారు. అయితే ప్రభుత్వంలో బిజెపి ప్రాబల్యం పెరగడంతో జెడియు నేతల నుండి సహజంగానే కవ్వింపు ధోరణులు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వాన్ని మంచి వాతావరణంలో శాంతియుతంగా నడిపించేందుకు ఇరువైపుల నుంచి సహకారం ఉండాలని గుర్తు చేసుకోవాలని సంజయ్ జైశ్వాల్ హితవు చెప్పారు. 2005కి ముందు ముఖ్యమంత్రి నివాసంలో హత్యలు, కిడ్నాప్‌లు జరిగేవని, ఇప్పుడు అలా మారడం తమకు ఇష్టం లేదని అంటూ కొంచెం కఠినంగానే మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీని జెడియు నేతలు తరుచూ ట్విట్టర్లో ట్యాగ్ చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధానితో ట్విట్టర్-ట్విట్టర్ అంటూ ఆడొద్దని హెచ్చరించారు. ఎవరి హద్దుల్లో వారు ఉండాలని లేదంటే బిహార్‌లోని 75 లక్షల మంది బిజెపి కార్యకర్తలు సమాధానం చెప్తారని స్పష్టం చేశారు.
అశోక చక్రవర్తిపై సినీ రచయిత జయ ప్రకాష్ సిన్హా అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీంతో ఆయనకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలంటూ జెడియు జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్, పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ ఉపేంద్ర కుష్వాహాలు డిమాండ్ చేశారు. మొఘలుల చక్రవర్తి ఔరంగజేబుతో సమానంగా అశోకుని పోల్చడాన్ని వ్యతిరేకిస్తూ జైశ్వాల్ కూడా జయప్రకాష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అయితే ప్రకాష్ సిన్హాను ఎందుకు అరెస్ట్ చేయలేదని, ఆయనకు ఇచ్చిన పద్మశ్రీని ఎందుకు వెనక్కు తీసుకోలేదంటూ జెడియు నేతలు పదేపదే ట్వీట్లు చేయడంతో పాటు ప్రధానిని ట్యాగ్ చేయడంపై జైశ్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సంజయ్ జైశ్వాల్ స్పందించారు.
కూటమి బలంగా, ఎక్కువ రోజులు ఉండాలంటే కూటమిలోని పార్టీల నేతలు ఎవరి హద్దుల్లో వారు ఉండాలని, రాష్ట్రపతి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకొమ్మని ప్రధానిని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
డిమాండ్ ఏకపక్షంగా ఉండకూడదని, ప్రధానితో ట్విట్టర్ ట్విట్టర్ అంటూ ఆడే ఆటలు ఆపేయాలని హెచ్చరించారు. అయితే తమ డిమాండ్ నెరవేరేంతవరకు వెనక్కి తగ్గేది లేదని అంటూ ఈ ట్వీట్‌పై ఉపేంద్ర కుష్వాహ్ ఘాటుగా స్పందించారు
మరోవంక, చిన్న గ్రూపులు (జెడియు) జాతీయ స్థాయిలో పెద్ద పార్టీల పని తీరును అర్థం చేసుకోలేవని బిజెపి ఒబిసి విభాగం ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ ట్వీట్ చేశారు. వారి పార్టీ గుర్తింపుపై వారికే అవగాహన ఉండదని పరోక్షంగా జెడియు నేతలకు చురకలంటించారు. వారు కొత్త స్థానం కోసం వెతకాల్సిన రోజు ఎంతో దూరంలో లేదంటూ ట్విట్టర్లో తెలిపారు.
దీనిపై జెడియు ప్రతినిధి అభిషేక్ జా స్పందిస్తూ కొందరు తమ స్థానాన్ని మరిచిపోయి ఊహల్లో తేలుతూ మాట్లాడుతుంటారని, కింద పడితే గాని వారి పరిస్థితి అర్థం కాదని, అలాంటి వారిని దైవం కాపాడాలంటూ సమాధానమిచ్చారు.
జనవరి 15న బీహార్ ముఖ్యమంత్రి జిల్లా నలందలో 13 మంది ప్రాణాలను బలిగొన్న మద్యం విషాద ఘటన అనంతరం ఈ ట్వీట్ల వార్ ప్రారంభమైంది. రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వం కారణంగానే మద్యనిషేధం వాగ్దానం విఫలమైందంటూ సంజయ్ జైస్వాల్ విమర్శలకు దిగడంపై జెడియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.