అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీని రైతు భరోసా పేరుతో విడుదల చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని రైతులకు భరోసా లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అదోగతి పాలు చేసి, రైతుల జీవితాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని సిఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో రైతులు పంటలకు నీళ్లు లేక, పొట్టదశకు వచ్చిన పంటల గింజలు తాలు అయ్యే పరిస్థితి వచ్చిందని, కొన్ని ప్రాంతాల్లో పొట్టకు రాకముందే పొలాలు ఎండిపోయి పశువులు మేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మొత్తం 50లక్షల ఎకరాల్లో వరి సాగైందని సగం పంటలకు నీటి సరఫరా కావడంలేదని చెబుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తున్నా కూడా రైతు భరోసా పథకం కింద రూ.15వేలు ఎందుకివ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12వేలు లేవు, కౌలు రైతులకు రూ.15వేలు జాడ లేదు, పత్తా లేవని ఆమె విమర్శించారు. \
ఇప్పటివరకు కూడా రైతు కూలీలను గుర్తించలేదు వాళ్లను గుర్తించడానికి కమిటీ కూడా వేయలేదని ఆమె ధ్వజమెత్తారు. రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాల రైతులకు ఇస్తరో కూడా ఎలాంటి ప్రణాళిక లేదని, ఇప్పటి వరకు కూడా ఎలాంటి కమిటీ వేయలేదని ఆమె చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కొత్త జీవోలను విడుదల చేయడానికి వీలు లేదని ఆమె తెలిపారు.
క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని రైతు భరోసా గ్యారెంటీ కింద చెప్పారని, కనీసం ఇప్పటివరకు కూడా జీవో విడుదల చేయలేదని రాణి రుద్రమ మండిపడ్డారు. నిజంగా రైతులకు బోనస్ ఇవ్వాలని ఉంటే వెంటనే జీవో విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో విడుదల చేయడానికి సిఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులకు సమయం దొరుకుతలేదని ఆమె మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపీటలు, చిన్నపీటలు వేసుకునే పంచాయతీ తప్ప రైతుల పంచాయతీని పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. వారం రోజులుగా పంటలు ఎండిపోయి రైతులు అరణ్య గోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.