18వ లోక్ సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 దశల్లో జరుగుతాయని వెల్లడించారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని, అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు.
రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మొత్తం పోలింగ్ 7 దశల్లో జరగనుంది. మొదటి దశ ఏప్రిల్ 19న, రెండో దశ 26న, మూడో దశ మే 7న, నాలుగో దశ 13న, ఐదో దశ 20న, ఆరో దశ 25న, చివరిదైన ఏడో దశ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా జూన్ 6 వరకు కొనసాగనుంది.
ఏపీ, తెలంగాణ లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలంగాణలోని కంటోన్మెంట్ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కూడా జరగనుంది. అయితే ఎన్నికలను 7 దశలో నిర్వహించడానికి గల కారణాలను ఎన్నికల కమిషన్ ప్రధాని అధికారి రాజీవ్ కుమార్ వివరించారు.
స్థానికంగా ఉండే భౌగోళిక పరిస్థితులు, పండుగలు, పరీక్షలు, అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా, 26న నామినేషన్లను పరిశీలించనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 29 వరకు ఉంది. మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతోపాటు ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.
ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుత లోక్ సభ కాల పరిమితి జూన్ 24వ తేదీతో ముగుస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో 47.1 కోట్ల మంది మహిళలని తెలిపారు.
మొత్తంగా కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటర్ల సంఖ్య 1.82 కోట్లు అని సీఈసీ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లలో 55 లక్షలకు పైగా ఈవీఎంల ను ఉపయోగించబోతున్నామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో తాగు నీరు, హెల్ప్ డెస్క్, వీల్ చెయిర్, ర్యాంప్ తదితర సదుపాయాలు ఉంటాయన్నారు.