వేతన సవరణపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సోమవారం రాత్రి ఇచ్చిన మూడు జీవోల పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు కొత్త సదుపాయాలు కల్పించకపోగా, గత ప్రభుత్వాలు కల్పించినవాటిలోనే కోతలు పెడుతున్నరని, ఇప్పుడు ఇస్తున్న మొత్తాలనే తగ్గిస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం సమావేశమై తమ భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని అంటూ సమ్మెకు సై అంటూ సంకేతం ఇచ్చారు. ఏ.పి.ఎన్.జీ.ఓ, రాష్ట్ర సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ ,డీఏలకు సంబంధించిన జీఓలను తిరస్కరిస్తున్నామని కూడా వెల్లడించారు.
అయితే వీరే ఈ నెల 8న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో 23 శాతం పిట్మెంట్ కు అంగీకరించి వచ్చారు. ఆ నాటి ఒప్పందం అమలుకు జీఓలు ఇలాగే ఉంటాయని తెలుసుకోలేక పోయారా? అనే అనుమానం ఈ సందర్భంగా కలుగుతుంది. ఆ మొత్తాన్ని డీ.ఏ.ల పద్దు క్రింద చెల్లించాల్సినబకాయిల మొత్తం నుండి సర్దుబాటు చేసుకుంటామని జీ.ఓ.లో పేర్కొన్నారు.
అందులో వింత లేదా మోసం ఏముంది! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హెచ్.ఆర్.ఏ. స్లాబులను తగ్గించింది. ఇహపై కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతన సవరణ ఉంటుందని ముఖ్యమంత్రి తన మనసులోని మాటను ఆనాడే చెప్పారు. తదనుగుణంగానే జీ.ఓ.లు జారీ చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.
పెండింగ్ లో ఉన్న అన్ని డీఏలను ఇస్తామని, రిటైర్మెంట్ వయసును 60 నుండి 62కు పెంచుతున్నామని చెప్పగానే అన్నీ మరచి ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి ముందు చప్పట్లుకొట్టారు. ఒకరిద్దరు ఆ రాత్రి డాన్సులు చేస్తూ చిందులు కూడా వేసి, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇప్పుడు ఉద్యోగుల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి, జీ.ఓ.లను చూడగానే పెల్లుబికింది. దాంతో ఉద్యోగ సంఘాల నాయకులు మొసలి కన్నీరు కారుస్తూ, ప్రభుత్వం మోసం చేసిందంటూ తెచ్చిపెట్టుకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు భావించవలసి వస్తుంది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు యు.జి.సి. వేతనాలు చెల్లించేవారు. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా యు.జి.సి. నూతన వేతనాలు దేశ వ్యాపితంగా అమలులోకి వచ్చాయి. మన రాష్ట్రంలో కూడా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.
అయితే, వైద్య కళాశాలల అధ్యాపకులకు మాత్రం యు.జి.సి. వేతనాలను చెల్లించకుండా “ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రివైజ్డ్ పే స్కేల్స్ -2020” అంటూ మార్పుచేసి, ఐదేళ్ల బకాయలు చెల్లించలేదు. వాళ్ళ సంఘాల నాయకులకు అడిగే ధైర్యం లేకపోయింది.