తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అంటూ మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తమకు ఆప్షన్ ప్రకారం బదిలీ చేయండని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బదిలీలకు సంబంధించిన 317 జీవో అనే పంజాలో చిక్కుకుని విలవిలాడుతున్న దుస్థితి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావడం అత్యంత హేయం అని ఆమె ధ్వజమెత్తారు. బదిలీల కోసం ఉద్యోగులు పెట్టుకున్న ఆప్షన్లు,ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో బదిలీలు చేపట్టి,ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడం దారుణమని ఆమె పేర్కొన్నారు.
బదిలీల పేరుతో ఉద్యోగులను, ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏడేండ్ల పాలనలో తమ కనీస డిమాండ్లను కూడా తీర్చటం లేదనే ఆగ్రహంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని ఆమె హెచ్చరించారు. బదిలీలు మాత్రం ఆగవద్దంటూ బలవంతంగా అధికారులకు హుకుం జారీ చేసి, ఉద్యోగులను అష్టకష్టాల పాలుచేస్తూ వారి ఉసురు తీస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతమొందించడం ఖాయం అంటూ ఆమె భరోసా వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ వేధింపులకు చరమగీతం పాడే రోజులు త్వరలోనే వస్తాయి అంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలీసులు అడ్డుకొని, లాఠీలకు పనిచెబుతూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను, ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు అని విజయశాంతి విమర్శించారు. ఇప్పటికే ఈ అనాలోచిత ప్రభుత్వ తీరును తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్ మాత్రం ప్రాణాలు పోతే పోనీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
భార్యభర్తలుగా ఉన్న ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకోకుండా భర్తను ఓ జిల్లాకు, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఆటలు ఆడుతున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కేసీఆర్ సర్కార్ పై ప్రత్యక్ష ఉద్యమానికి పూనుకుని ప్రగతి భవన్‌ను ముట్టడించి తమ గోడును, ఆవేదనను తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే వారిని అడుగడుగునా అణిచి వేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.