తెలుగుదేశం పార్టీ శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు సీనియర్ నాయకులకు చోటుదక్కలేదు. అయితే, ఈ జాబితాలో తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌కు బాపట్ల పార్లమెంటు సీటు దక్కడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే బిజెపి- టీడీపీ- జనసేన కూటమి సీట్ల పంపకంలో భాగంగా బిజెపికి 6 ఎంపీ సీట్లు కేటాయించారు. అయినప్పటికీ బాపట్ల సీటును బిజెపి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్‌కు కేటాయించడం పట్ల టిడిపి వర్గాలలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
ఆంధ్రాలోని టిడిపి నేతలకు కాకుండా తెలంగాణలోని బిజెపి నేతకు ఎంపీ టిక్కెటు ఇవ్వడం ఏంటని బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కృష్ణప్రసాద్ బిజెపి టికెట్‌ను ఆశించినా, అప్పుడు టికెట్ దక్కలేదు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనైనా వరంగల్ సీటు వస్తుందనే ఆశతో వున్న ఆయనకు అనూహ్యంగా బాపట్ల సీటు దక్కింది. 1986 బ్యాచ్ ఐపీఎస్ అయిన కృష్ణప్రసాద్ 2004లో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు.