ముగ్గురు మంత్రులతో సహా ప్రముఖ ఓబిసి ఎమ్యెల్యేలు వరుసగా పార్టీ నుండి నిష్క్రమించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్ లో పార్టీకి ఏర్పడిన లోటును భర్తీ చేయడం కోసం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చురుకైన పాత్రకు సిద్ధమవుతున్నారు.
ఈ వారాంతం నుండి, అమిత్ షా క్షేత్రస్థాయిలో ఎక్కువగా కనిపిస్తారు. తద్వారా ప్రచారం ఊపందుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తల నైతికతను ఇనుమడింప చేయడం పట్ల దృష్టి సారింపనున్నారు. కరోనా కారణంగా బహిరంగ ర్యాలీలు, యాత్రలపై నిషేధాన్ని కొనసాగింఎన్నికల కమీషన్ ఈ నెల 22న మరోసారి సమీక్ష చేయనున్నది. ఆ తర్వాత అమిత్ షా విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నాయి.
పార్టీ యూపీని విభజించిన బ్రజ్, కాశీ, అవధ్, గోరఖ్పూర్, పశ్చిమ యూపీ, కాన్పూర్లోని మొత్తం ఆరు సంస్థాగత ప్రాంతాలలో ర్యాలీలు, అలాగే ప్రచారం, టికెట్ల పంపిణీని ఆయన పర్యవేక్షిస్తారు.
గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా యుపి ఇన్ ఛార్జ్ గా ఉన్న అమిత్ షా 2014 ఎన్నికలలో ఆ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలను గెల్చుకొని, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం ఏర్పర్చడంలో కీలక భూమిక వహించారు. యుపిలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది.
యుపిలోని 403 సీట్లలో 270-290 సీట్లు గెలుస్తామని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షా సారధ్యంలో 300 సీట్ల మార్కును దాటేందుకు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2017లో బిజెపి 325 సీట్లు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంలో కూడా ఆయనే కీలకంగా వ్యవహరించారు.
జాతీయ రాజకీయాలలో నిర్ణయాత్మక ప్రభావం చూపే ఉత్తర ప్రదేశ్ లో బిజెపి రాజకీయంగా ఆధిపత్యం వహించేటట్లు చేయడంలో అమిత్ షా వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రధానం అని అందరు భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో నెలకొన్న కులసమీకరణలను బిజెపికి అనుకూలంగా మలుచుకోవడంలో ప్రధాన పాత్ర వహించారు.
యూపీ ప్రచార బాధ్యత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీనియర్ నేత రాధామోహన్సింగ్పైనే ఉందని షా గతంలోనే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఇప్పుడు తిరిగి గెలిపించడం ద్వారా,2024లో తిరిగి మోదీ మరోసారి కేంద్రంలో గెలుపొందడానికి మార్గం సుగమం చేయాలని రెండు నెలల క్రితం అమిత్ షా యుపి పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలకు పిలుపివ్వడం గమనార్హం.
ఏదిఏమైనా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న వైషమ్యాలను పరిష్కరించడం పట్ల ఆయన ప్రధానంగా దృష్టి సారింపనున్నట్లు తెలుస్తున్నది. ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే ప్రాంతాలలో ఒకటి తూర్పు యుపి ఒకటి కానున్నది.
ఈ ప్రాంతంలోనే ఓబిసి నాయకుల నిష్క్రమణ పార్టీపై చూపగల ప్రభావాన్ని పరిమితం చేయడం కోసం కసరత్తు చేయవలసి ఉంది. వారు ఇతర పార్టీల నుండి వచ్చినందున వారి నిష్క్రమణ పెద్ద తేడా లేదని బిజెపి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పైగా ఆ వర్గాల నుండే తమలో బలమైన నాయకులూ ఉన్నారని చెబుతున్నప్పటికీ వారికి ప్రాబల్యంగల కొద్దిపాటు ప్రాంతాలైన ఎన్నికలలో కీలకంగా మారే అవకాశం ఉంది.
కరోనా కారణంగా ఎన్నికల సంఘం ర్యాలీలు, యాత్రలను నిషేధించే ముందే బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జన్ విశ్వాస్ యాత్రల శ్రేణిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. అభ్యర్థులతోపాటు వ్యూహాలను ఖరారు చేసేందుకు పార్టీ నిర్వహించిన అన్ని సమావేశాల్లో ఆయన కూడా భాగమయ్యారు.