పిఠాపురం ప్రజలను అర్థిస్తున్నా.. నన్ను గెలిపించండి అని పేర్కొంటూ ప్రజల కోసం నిలబడతానని.. తనను ఆశీర్వదించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.పిఠాపురం నుండి పోటీచేస్తానని ప్రకటించిన ఆయన శనివారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. తనను ఓడించేందుకు ఏపీ సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
తనను ఓడించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మండలానికో నాయకుడిని పెడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే జవాబుదారీతనం అని భరోసా ఇచ్చారు. తాను మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనక్కితీసుకోనని తెలిపారు. తనకు సినిమాలపై, రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు.
దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నానని చెబుతూ ఏపీలో నాణ్యత లేని మద్యం విక్రయించడం వల్లే చాలామంది చనిపోయారని ఆయన ఆరోపించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయంలో కొంత మొత్తమే ప్రభుత్వానికి వెళ్తోందని.. మిగిలినదంతా జగన్, ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు.
వైసీపీ కావాలా.. కూటమి కావాలా నిర్ణయించుకోండని చెప్పారు. పిఠాపురానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తెస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా ఫిర్యాదు చేయాలంటూ ఒక ఫోన్ నెంబర్ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. దాదాపు 8 లక్షల ఫిర్యాదులు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.
వీటిలో 2 లక్షల ఫిర్యాదులు మంత్రుల అవినీతిపై వస్తే, మరో నాలుగు లక్షల ఫిర్యాదులు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై వచ్చాయని.. ఈ ఫిర్యాదులపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అవినీతి రాజ్యమేలుతుందని, వైసీపీ నాయకులు కమీషన్లు లేకుండా ఏ పని చేయని పరిస్థితి నెలకొందన్నారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారం మొదటిరోజు వైసీపీ అధినేత జగన్కు పలు ప్రశ్నలు సంధించారు. బస్సు యాత్రలో జగన్ మాట్లాడుతున్న తాను పేదోడ్ని.. పేద ప్రజల మనిషిని అంటున్న వ్యాఖ్యలకు జనసేనాని కౌంటర్ ఇచ్చారు. వందల కోట్ల రూపాయిల విలువ కలిగిన కంపెనీలు ఉన్న జగన్ ఎలా పేదవాడవుతాడు.. ప్రజల సొమ్ము దోచుకుంటున్న వైసీపీ అధినేత ఎలా పేద ప్రజల మనిషి అవుతారంటూ ప్రశ్నించారు. జగన్ తన పాలనలో చేసిన అక్రమాలు, వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలను ప్రజలకు వివరించారు పవన్ కళ్యాణ్.