రాబోయే లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా సాగుతున్న ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడోసారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మోదీ ఆదివారంనాడు శ్రీకారం చుట్టారు.
అవినీతిపై తమ ప్రభుత్వం కొరడా తీసినందుకే కొందరు వ్యక్తులు కుతకుతలాడుతున్నారంటూ విపక్షాలు, అవినీతి నేతల అరెస్టులపై ప్రధాని విమర్శలు గుప్పించారు. గత పదేళ్లుగా అవినీతిపై తాము పోరాటం సాగిస్తున్న విషయం యావద్దేశానికి తెలుసునని, పేద ప్రజల సొమ్మును దళారులు దోచుకోకుండా చూశామని చెప్పారు.
అవినీతిపై తాను సాగిస్తున్న పోరాటం కొందరికి ఇబ్బందిగా మారిందని ఎద్దేవా చేశారు. ‘భ్రష్టాచార్ హఠావో’ అనేది మోదీ మంత్రమని, ‘భ్రష్టాచార్ బచావో’ అనేది వాళ్ల (విపక్షాల) మంత్రమని విమర్శించారు. అవినీతిపై పోరాడుతున్న ఎన్డీయేకు, అవినీతికి కొమ్ముకాసే వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న ఎన్నికలు కావని, అభివృద్ధి భారత్ లక్ష్యంగా జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు.
మీరట్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడ్నించే తాను ప్రారభించానని చెప్పారు. 2024 ఎన్నికల్లో తొలి ర్యాలీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
రాబోయే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్ కూడా సిద్ధం చేశామని తెలిపారు. మూడో దఫా అధికారంలోకి రాగానే తొలి 100 రోజుల్లో తీసుకునే భారీ నిర్ణయాలపై కసరత్తు చేస్తు్న్నామని చెప్పారు. గత పదేళ్లపై ఊపందుకున్న అభివృద్ధిని మరింత శరవేగంగా పరుగులు తీయిస్తామని భరోసా ఇచ్చారు. విశిష్ట భారత్‌కు ఇదే సరైన తరుణం అని ఎర్రకోట నుంచి తాను చెప్పానని గుర్తు చేశారు.