భారత్, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతియుత సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ముఖ్యమని అన్నారు. దౌెత్య, మిలిటరీ స్థాయి చర్చల్లో నిర్మాణాత్మకంగా, సానుకూలంగా ఉంటే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.
ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో శాంతియుత, ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించగలవు, కొనసాగించగలవని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన న్యూస్‌వీక్ మ్యాగ్జిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘సరిహద్దుల్లో దీర్ఘకాలంగా నెలకొన్న విబేధాలు వేగంగా పరిష్కారం కావాలి.. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుంది.. సానుకూల చర్చల ద్వారా సరిహద్దుల్లో పొరుగుదేశాలు శాంతిని నెలకొల్పుతాయి’ అని ప్రధాని తెలిపారు.
హిందూ మహాసముద్రంలోని దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్) ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమకు వ్యతిరేకంగా క్యాడ్ కూటమి ఏర్పడిందంటూ గతంలో చైనా చేసిన ఆరోపణల నేపథ్యంలో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
క్వాడ్ గ్రూప్ గురించి మాట్లాడుతూ.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, చైనా దేశాలు అనేక గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నాయని తెలిపారు. క్వాడ్ ఏ దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశించి లేదని, ఎస్‌సిఒ, బ్రిక్స్ సహా ఇతర అంతర్జాతీయ సంస్థల్లానే క్వాడ్ కూడా ఓ సానుకూల ఎజెండాపై పనిచేసే దేశాల సమూహమని పేర్కొన్నారు. క్వాడ్ సమూహంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు ఉన్నాయి.
ఈ సందర్భంగా భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని, ఆర్థిక వ్యవస్థ శరవేగంతో దూసుకెళుతోందని తెలిపారు. దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికపరంగా దేశం ఎదుగుతున్న తీరు.. భారత్‌ను ఓ వర్ధమాన సూపర్ పవర్‌గా నిలబెడుతోందని మోదీ పేర్కొన్నారు. దేశంలోని సార్వత్రిక ఎన్నికలు, క్వాడ్, అయోధ్య రామ మందిరం తదితర అంశాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మోదీ ప్రస్తావించారు. చైనాతో సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యమని ప్రధాని ఉద్ఘాటించారు.
అయోధ్యలోని రామ మందిర ప్రారంభం గురించి ఆయన మాట్లాడుతూ.. తన జన్మభూమి అయిన అయోధ్యకు రాముడు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని మోదీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలన్నీ తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు.
‘ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండోసారి పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుంది.. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది.. భారత్ మాత్రం ఇందుకు మినహాయింపు. మా ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోంది’ అని మోదీ ధీమాగా చెప్పారు.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య క్షీణించిన సంబంధాల గురించి కూడా మోదీ మాట్లాడారు. ‘నేను పాకిస్థాన్ కొత్త ప్రధానికి శుభాకాంక్షలు చెప్పాను.. తమ ప్రాంతంలో ఎల్లప్పుడు శాంతి, సుస్థిరత, సౌభాతృత్వం, భద్రతను.. ఉగ్రవాదరహిత, ప్రశాంతమైన పరిస్థితిని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది..’ అని ప్రధాని పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌పై మాత్రం మోదీ స్పందించడానికి నిరాకరించారు.