ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరిహారం చెల్లింపులో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వచ్చి కోర్ట్ ముందు హాజరు కావాలని కూడా సమన్లు జారీ చేసింది.
కరోనా పరిహారం చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఖన్నాలతో కూడిన బెంచ్ బుధవారం విచారణ జరిపింది. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు విచారణకు హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. వారు చట్టానికి అతీతులు కారని స్పష్టం చేసింది.
కరోనాతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుకోసం మార్గదర్శకాలను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మెయింటెనెన్స్ అథారిటీ (ఎన్డీఎంఏ)ని 2021 జూన్ 30న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను ఎన్డీఎంఏకే వదిలివేసింది.
కోర్టు. తర్వాత కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని సిఫార్సు చేసినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. చనిపోయిన వారి బంధువులకు రూ.50వేలు చెల్లించాలన్న కేంద్రం సిఫార్సును కోర్టు 2021లో ఆమోదించింది.
అయితే పరిహారం చెల్లింపులో జాప్యంతో కేసు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సీరియస్ అయిన బెంచ్.. తక్షణం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో.. మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్‌లు విచారణకు హాజరయ్యారు.
ఈ పరిణామంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తన జీవితంలో మొదటిసారిగా సుప్రీం కోర్ట్ ఎదుట హాజరు కావలసి వచ్చిన్నట్లు ఏపీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆవేదనకు గురయ్యారు.
కోర్టుకు క్షమాపణలు తెలుపుతూ ఇకపై తానే వ్యక్తిగతంగా అన్నీ పర్యవేక్షించి, బాధితులకు డబ్బులు అందేలా చూస్తానని కోర్టుకు తెలిపారు. రెండు వారాల సమయం ఇస్తే బాధితులకు పరిహారం అందించి, అన్ని వివరాలు కోర్టుకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
దీనిపై స్పందించిన జస్టిస్ ఎంఆర్ షా బెంచ్ అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి ఉంటే.. పిలవాల్సిన అవసరం తమకు రాదు కదా అని పేర్కొంది. చెప్పించుకునే వరకు ఎందుకు తెచ్చుకుంటారని అసహనం వ్యక్తం చేసింది. కాగా, వర్చువల్ మోడ్ లో ఆడియో సమస్య రావడంతో బిహార్ సీఎస్ మాట్లాడలేకపోయారు.