విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు ఈ ఘటన చేసుకుంది. రాయి సీఎం జగన్ నుదిటి భాగంలో బలంగా తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయ్యింది.
సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం రాయి తగిలి గాయం అయ్యింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత సీఎం జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రకు భారీగా జనం హాజరయ్యారు.
విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా యాత్ర కొనసాగించింది. సీఎం జగన్ భారీ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ వైసీపీ నేతలుఆరోపిస్తున్నారు.
విజయవాడలో సీఎం జగన్ పై టిడిపి నేతలు దాడికి పాల్పడ్డారని వైసీపీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆరోపించింది. వైసీపీ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ మూకలు పిరికిపంద చర్యకు పాల్పడ్డాయని విమర్శించింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారని తెలిపింది.
సీఎం జగన్పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అని వ్యాఖ్యానించింది. దెబ్బతగిలిందని నటించబోయే ముందు… కెమెరా ముందు నటించేటప్పుడు అంటూ రెండు ఫొటోలను చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది.
పలువురు ప్రముఖుల ఖండన
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. జగన్పై దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తదితరులు ఖండించారు.
జగన్పై జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. రాజకీయాలు ఎప్పుడూ హింసాత్మంగా మారకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.
సీఎం జగన్ పై దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త వైఎస్ జగన్ అన్న. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఈ ఘటనపై ఈసీ కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను” అని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై దాడి జరిగి కన్ను పై భాగంగా గాయం కావటం బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నామన్నారు. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ షర్మిల తెలిపారు.