ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శనివారం ఆగంతకులు రాయితో దాడి చేసిన 24 గంటల సమయంలోనే అలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులపై రాళ్ల దాడి జరిగింది. అయితే ఈ ఘటనలలో రాళ్లు చంద్రబాబు, పవన్ లకు దూరంగా పడడంతో వాళ్లకు గాయాలు కాలేదు.
చంద్రబాబు విశాఖ జిల్లా గాజువాక ప్రజాగళం సభలో మాట్లాడుతున్న సమయంలో ఆగంతకులు చంద్రబాబుపై రాళ్లు విసిరారు. ఈ రాళ్లు చంద్రబాబు సమీపంలో పడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పరారయ్యారు. తనపై రాళ్లు విసరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు వేసిన వారిని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాళ్లు వేసిన దుండగులను పట్టుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా, నిందితులు పరారయ్యారు.
అనంతరం సభలో చంద్రబాబు మాట్లాడుతూ…”ప్రభుత్వం నీది.. ముఖ్యమంత్రి నువ్వు.. నీ ప్రభుత్వంలో కరెంటు పోతే, నిన్ను ఎవరో చీకట్లో కొడితే నన్ను అంటావా? ఇలాగే కోడికత్తి డ్రామా ఆడావు, బాబాయ్ గొడ్డలి వేటు డ్రామా ఆడావు. నా మీద తోశావ్. నాకు నేరాలు అంటగడతావా ? నేను నీలాగా నేరస్తులని ప్రోత్సహించను. నేరాలు చేసే వాళ్లని తొక్కుతా.” అని శనివారం జరిగిన ఘటనపై విమర్శలు చేశారు.
నిన్న చీకట్లో సీఎం జగన్ పై గులకరాయి వేశారని, ఇప్పుడు కరెంటు ఉండగానే తనపై రాయి విసిరారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఈ పనులు చేస్తుందని మండిపడ్డారు. తెనాలి వారాహి సభలో పవన్ కల్యాణ్‌పై కూడా రాళ్లు విసిరారని ధ్వజమెత్తారు. క్లైమోర్ మైన్స్‌కే తాను భయపడలేదని చంద్రబాబు గుర్తు చేశారు. గత ఎన్నికల సమయంలో కూడా తనపై రాళ్ల దాడి చెప్పారు.
శనివారం జగన్ సభలో కరెంటు పోయిందని, దానికి ఎవరు బాధ్యత వహించాలని చంద్రబాబు ప్రశ్నించారు. రాళ్ల దాడులు జరుగుతుంటే చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని నిలదీశారు. జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించామని, కానీ పేటీఎం బ్యాచ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, రాళ్లు తాను వేయించినట్లు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ పై రాయితో దాడికి యత్నం
మరోవంక, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘వారాహి’ యాత్రలో రాయితో దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరాడు.
అయితే, ఆ రాయి పవన్‌కు తగలకుండా.. సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ వ్యక్తి రాయితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మరుసటి రోజే పవన్ కళ్యాణ్ పై దాడి యత్నం జరగడం చర్చనీయాంశంగా మారింది.