రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలనలో సామర్ధ్యం కనబరిచిన బీజేపీ మోడల్, విఫలమైన కాంగ్రెస్ మోడల్లో ఏది ఎంచుకుంటారనేది ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని విపక్షాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు తనకు భారీ ప్రణాళికలు ఉన్నాయని చెబితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరినీ భయపెట్టే నిర్ణయాలు తాను తీసుకోనని స్పష్టం చేశారు.
దేశ అభివృద్ధికి బాటలువేసే నిర్ణయాలనే తాను తీసుకుంటానని చెప్పారు. ప్రతి పనినీ సరైన దిశలో తీసుకోవాలని తాను ప్రయత్నిస్తానని పేర్కొంటూ తాను ఇంకా చేయాల్సింది ఎంతోఉందని, దేశ అవసరాలు ఎన్నో ఉన్నాయనే విషయం తనకు తెలుసునని చెప్పారు. ప్రతి కుటుంబం కలలు ఎలా నెరవేర్చాలనేదే తన ఆకాంక్ష అని, అందుకే ఇది అభివృద్ధికి ట్రైలర్ మాత్రమేనని అన్నానని గుర్తుచేశారు.
2047 వికసిత్ భారత్ ప్రాజెక్ట్ పనులు రెండేండ్లుగా సాగుతున్నాయని, తాను తిరిగి ప్రధానిగా అధికార పగ్గాలు చేపడితే తొలి 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నానని చెప్పారు.
రాబోయే 25 ఏండ్లలో భారత్‌ను ఎలా చూడాలనుకుంటున్నారని తాను 15 లక్షల మందికి పైగా వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు స్వీకరించానని వివరించారు. ఆపై తాను ఏఐ సాయంతో అంశాల వారీగా వాటిని వర్గీకరించానని ప్రధాని తెలిపారు. దీనిపై పనిచేసేందుకు ప్రతి విభాగంలో అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని మళ్లీ అధికారంలోకి తెస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందంటూ ప్రతిపక్షాలు ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్షమని ఆయన ప్రకటించారు.తనకు భారీ ప్రణాళికలు ఉన్నాయని చెబితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరినీ భయపెట్టే నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు. దేశ సమగ్రాభివృద్ధికి కోసమే నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు.
విజన్ 2047 గురించి మాట్లాడుతూ 2047లో మనం 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటామని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని మైలురాయిని చేరుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు విఫల కాంగ్రెస్ నమూనాకు, తన పనితీరును చూపిన బిజెపి నమూనాకు మధ్య తేడాను గుర్తించి ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఓటరుకు కల్పిస్తున్నాయని మోదీ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు 5, 6 దశాబ్దాలు పనిచేశాయని, తాను కేవలం 10 ఏళ్లు మాత్రమే పనిచేశానని ఆయన చెప్పారు. ఏ రంగంలో పోలికలు చూసినా కొన్ని లోపాలు ఉండడం సహజమేనని, అయితే మన ప్రయత్నంలో లోపాలు ఉండరాదని ఆయన చెప్పారు.
ఓటమి భయంతోనే ఆరోపణలు
లోక్‌సభ ఎన్నికలలో తమకు సమాన అవకాశాలు దక్కడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. ఇవి ఓటమి భయంతో చేస్తున్న ఆరోపణలని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థలకు సంబంధించిన చట్టాలు తాను అధికారంలోకి రాకముందు నుంచి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ప్రభుత్వం దుర్వినియో గం చేస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
కేవలం 3 శాతం కేసులు మాత్రమే రాజకీయ నాయకులపై ఉన్నాయని, గతంతో పోలిస్తే గత పదేళ్లలో అత్యధిక మొత్తంలో నగదును ఇడి జప్తు చేసుకుందని ఆయన తెలిపారు. ఇడి, సిబిఐ, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన చట్టాలేవీ తన ప్రభుత్వం చేయలేదని ఆయన చెప్పారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీలో ప్రతిపక్ష నాయకుడికి కూడా చోటు కల్పిస్తూ తన ప్రభుత్వం బిల్లు ఆమోదించిందని మోదీ గుర్తు చేశారు.
నేడు ఎన్నికల కమిషన్ ఏర్పడితే అందులో ప్రతిపక్షం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రధాన మంత్రి ఫైలుపై సంత కం పెట్టి ఎన్నికల కమిషన్‌ను నియమించేవారని, ప్రధాని కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎన్నికల కమిషనర్లు అయ్యేవారని మోదీ ఆరోపించారు. పదవి అయిపోయిన తర్వాత రాజ్యసభ టికెట్లు, మంత్రి పదవులలో వారిని నియమించేవారని ఆయన చెప్పారు. ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్షాలు సాకులు వెతుకుతున్నాయని ఆయన ఆరోపించారు.
బాండ్ల రద్దుతో మళ్లీ నల్ల ధన ప్రవాహం
ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై ప్రధాని మోదీ స్పందిస్తూ నిజాయితీగా ఆలోచించిన పక్షంలో ప్రతి ఒక్కరూ ఇందుకు పశ్చాత్తాపం చెందుతారని వ్యాఖ్యానించారు. నల్ల ధనం వాడకాన్ని ఎదుర్కొనేందుకే తన ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు.
బాండ్ల గురించి ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి వేల కోట్ల రూపాయల నిధులు సమకూరాయన్న విమర్శను ఆయన తిప్పికొట్టారు. మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొన్న తర్వాత 16 కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని మోడీ చెప్పారు. అయితే వాటిలో 63 శాతం విరాళాలు బిజెపియేతర పార్టీలకే వెళ్లాయని ఆయన వివరించారు.