ఉద్యోగస్తులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభా పార్టీ నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి గల ప్రేమ ఇప్పుడు తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు.. ప్రతిదీ దగా, మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ఉద్యోగస్తులకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే, వాటినే సీఎం జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ చూడలేదని పేర్కొన్నారు. ఇలాంటి రాక్షస పాలన చరిత్రలో ఎక్కడ జరగలేదని కూడా స్పష్టం చేశారు. ఈ పోస్ట్ కి రాజీనామా చేసి వేరే రాష్ట్రానికి వెళ్లి పాలన చేయాలని హితవు పలికారు.
ఏపీలో అన్ని రేట్లను పెంచేసి ఉద్యోగులకు మాత్రం జీతాలు తగ్గిస్తున్నారని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభానికి కూడా ముఖ్యమంత్రికి రెండు మూడు గంటల సమయం లేదా అని బిజెపి నేత ప్రశ్నించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి నీ ఏ జన్మ లోనూ చూడలేమేమోనని సీఎం జగన్మోహన్రెడ్డిని ఎద్దేవా చేశారు.
ఈ పీఆర్సీని అంగీకరించం
ఇలా ఉండగా, పీఆర్సీపై ఏకపక్ష జీవో జారీ చేసిన జగన్ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి. గురువారం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి చేబడుతూ ఈ పీఆర్సీని తాము అంగీకరించమని స్పష్టం చేశారు. ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట మరిచిపోయి ఆయన అనుకున్న విధంగా చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
మిశ్రా కమిటీ నివేదికను పక్కనపెట్టి.. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం పీఆర్సీని ప్రకటించారని, దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జీవోలను వెనక్కి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.