బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఇంటి వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన వారిని గుజరాత్‌లోని భుజ్‌లో అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను విక్కీ సాహబ్ గుప్తా, సాగర్ శ్రీజోగేందర్ పాల్గా గుర్తించారు. వీరిద్దరు నవీ ముంబైలోని పన్వెల్‌లో ఉన్న హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నట్లు అధికారులు చెప్పారు. సల్మాన్ ఖాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్ ఉన్న విషయం తెలిసిందే.
ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. వాటి ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించారు.