ఆంధ్ర ప్రదేశ్ లో కేసినో సంస్కృతి వ్యాప్తి చేస్తుండడం పట్ల బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని థాయిల్యాండ్లా మార్చేస్తారా? అంటూ ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
ఓవైపు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదంటూ, మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు పేకాట క్లబ్బులు, కేసినోల పేరుతో దోచుకుంటున్నారని ఎంపీ మండిపడ్డారు. గోవా తరహాలో కేసినోలు అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తర్వాత దశలో ధాయిల్యాండ్ తరహాలో మసాజులు, ఇతర జుగుప్సాకర కార్యకలాపాలు తీసుకొస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.
దీనిపై మంత్రి నాని ఏం సమాధానం చెబుతారు అంటూ జీవీఎల్ పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పారు. “ఊఁ అంటావా.. నాని, ఉహూఁ అంటావా?” అంటూ ప్రశ్నించారు. కర్నూలులో బిజెపి తలపెట్టిన ప్రజా నిరనస సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక, ముస్లిం బుజ్జగింపు విధానాలను ఎండగట్టడమేనని జీవీఎల్ స్పష్టం చేశారు.
గత నెలలో విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ తరహాలో కర్నూలు సభ విజయవంతం అవుతుందని ఆయన చెప్పారు. అక్రమంగా నిర్మిస్తున్న మసీదును అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తమ పార్టీ నేతలు వెళ్తే, వారిపైనే దాడులు జరిగాయని ఆయన విమరసంచారు.
అయితే ఏపీ ప్రభుత్వం దాడి చేసినవారిపై కేసులు పెట్టకుండా, ఉల్టా బీజేపీ నేతలపైనే కేసులు పెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక పీఎఫ్ఐ వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ అలాంటి విద్రోహ శక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండ కల్పిస్తోందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించే ముందు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల జీతాలు తగ్గించుకోవాలని జీవీఎల్ నరసింహారావు హితవు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను చూస్తేనే ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నట్టు అర్థమవుతుందని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాలు సైతం బీజేపీతో కలసి నడవాల్సిన అవసరముందని ఆయన పిలుపిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఎలాగైతే న్యాయం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలా న్యాయం చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంపై పెట్టే దుబారా ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగుల జీతాలు పెంచాలని సూచించారు. వందల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తూ సలహాదారులను పెట్టుకున్నారని, అంత మంది సలహాదారుల అవసరమేముందని జీవీఎల్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుకోడానికి లేని ఇబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచితేనే వస్తుందా అని ప్రశ్నించారు. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు మాత్రమే త్యాగం చేయాలా.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎందుకు చేయరు? అంటూ ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని న ప్రశ్నించారు.
కాగా, రాష్ట్రంలో కొత్త రకం తామర తెగులు సోకి తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతుల గోడు పట్టదా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన ప్రశ్నించారు. దేశంలో మిర్చి ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 60 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం వాటాయే 40 శాతం ఉంటుందని తెలిపారు.
కొత్త రకం తామర తెగులు కారణంగా ఏపీ, తెలంగాణలో మిర్చి పంట దారుణంగా దెబ్బతిన్నదని చెబుతూ ఏపీలో 80 శాతం పంట కొత్త రకం తామర తెగులు (థ్రిప్స్ జాతి పురుగులు) కారణంగా దెబ్బతిన్నదని జీవీఎల్ అన్నారు. ఈ క్రమంలో స్పైసెస్ బోర్డ్ తరఫున మిర్చి టాస్క్ఫోర్స్ చైర్మన్గా తాను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులను కలిసి పరిస్థితిని వివరించానని ఆయన చెప్పారు.
ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రూ. 4 వేల కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లిందని చెబుతూ ఇంతగా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు నష్టపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు అసలేమాత్రం పట్టించుకోవడం లేదని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.