గత అర్ధ శతాబ్దకాలంగా భారత సైనికుల శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా,దేశ రక్షణకోసం తమ ప్రాణాలను అర్పించిన వారికి నివాళి ఘటిస్తూ, దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ వస్తున్న దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద సైనికుల స్మరణ కోసం ఏర్పాటు చేసి అమర్ జవాన్ జ్యోతి ‘‘శాశ్వత జ్వాల’’ ఇక చరిత్రలో కలికిపోతున్నది.
ఈ రోజు జరిగే వేడుకలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని జ్యోతితో విలీనం చేయనున్నట్టు అధికారక వర్గాలు తెలిపాయి. జ్యోతిలో కొంత భాగాన్ని ఈరోజు మధ్యాహ్నం యుద్ధ స్మారకం వద్దకు తీసుకువెళ్లనున్నారు. అయితే,. ‘అమర్ జవాన్ జ్యోతి జ్వాల ఆరిపోవడం లేదు.. దాన్ని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో కలిపేస్తున్నారు” అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుల జ్ఞాపకార్థం బ్రిటిష్ వారు ఇండియా గేట్ నిర్మించారు. 1971లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమర్ జవాన్ జ్యోతిని ఇండియా గేట్ కింద ఉంచారు. మొదటి ప్రపంచ యుద్ధం, ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ వారి కోసం పోరాడిన వారి పేర్లు ఇండియా గేట్పై చెక్కారు.
1971 యుద్ధంతో సహా స్వాతంత్య్రం తర్వాత జరిగిన యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల పేర్లు జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో పొందుపరిచాం అని అధికార వర్గాల చెబుతున్నాయి. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించడం నిజమైన శ్రద్ధాంజలి (నివాళి) కాగలదని పేర్కొంటున్నారు.
జ్వాల విలీనం చేస్తున్న నేషనల్ వార్ మెమోరియల్ 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనిని రూ 176 కోట్ల వ్యయంతో 2019లో నిర్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్మారక చిహ్నంలో భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం చేసిన ప్రసిద్ధ యుద్ధాలను వర్ణించే ఆరు కాంస్య కుడ్యచిత్రాలు వీర్త చక్రంలో కప్పబడిన గ్యాలరీలో ఉన్నాయి.