కరోనాఇన్ఫెక్షన్లు కొనసాగినా మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఒమిక్రాన్ వేవ్ ముగిసిన తర్వాత కరోనా తిరిగి వచ్చినా మహమ్మారి మాత్రం కనుమరుగవుతుందని పేర్కొంది.
ఆరోగ్య వ్యవస్థలు, సమాజాలు ఎదుర్కొనే పునరావృత వ్యాధిగా కరోనా మారుతుందని ..అయితే సార్స్-కోవ్-2 కట్టడికి ప్రభుత్వం , సమాజం అసాధారణ చర్యలు తీసుకునే దశ ముగుస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది.వ్యాక్సినేషన్, ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ బలహీనమయ్యే కొద్దీ కరోనా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతుందని, ముఖ్యంగా శీతాకాలంలో వైరస్ల వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. వైరస్ ప్రభావం మున్ముందు తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.
రాబోయే రోజుల్లో కరోనా వైరస్ల వ్యాప్తి ఆరోగ్యంపై ప్రభావం పరిమితంగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది.వైరస్ను గతంలో ఎదుర్కొన్న అనుభవం, నూతన యాంటీజెన్స్, వేరియంట్స్కు వ్యాక్సినేషన్ చేపట్టడం , యాంటీవైరల్ డ్రగ్స్ అందుబాటులోకి రావడం, వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలతో కరోనా తీవ్రత తగ్గుతుందని పేర్కొంది.
ఒమిక్రాన్ వేవ్ ఇంకా తలెత్తని దేశాల్లో తాజా వేరియంట్ ముమ్మర దశకు చేరవచ్చని , ఈ స్ట్రెయిన్ కట్టడికి చేపట్టే నియంత్రణ చర్యలు ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోకపోవచ్చని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఒమిక్రాన్ నియంత్రణ కోసం నియంత్రణ వ్యూహాలను తిరిగి రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.