సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, భద్రతా సిబ్బందితో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈక్రమంలోనే ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బిజిఎల్), 12-బోర్ రైఫిల్ మరియు మజిల్-లోడింగ్ రైఫిల్స్‌తో సహా 12 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం… ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్), బస్తారియా బెటాలియన్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) లతో పాటు రాష్ట్ర పోలీసుల ఉమ్మడి బృందం పాల్గొంది. గురువారం రాత్రి నుంచి ఆపరేషన్ కొనసాగుతోంది.
“బీజాపూర్ జిల్లా కేంద్రానికి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలోని పిడా అడవుల్లో ఓ ప్రముఖ మావోయిస్టు నాయకుడు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. దీని ప్రకారం అనుసరించి ఈ ఆపరేషన్ ప్లాన్ చేయబడింది. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు వెలికి తీశారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతదేహాలను గుర్తించాలి.” అని సౌత్ బస్తర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమలోచన్ కశ్యప్ తెలిపారు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పులు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయని ఆయన తెలిపారు.