మరో వారం రోజులలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావలసి ఉండగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడుతో సహా 875 మంది సిబ్బంది కరోనా బారిన పడటం అధికార వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నది. వెంకయ్య నాయుడు కరోనా బారిన పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. .
అధికారిక వర్గాల ప్రకారం, జనవరి 20 వరకు 2,847 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 875 మంది పార్లమెంటరీ సిబ్బంది పాజిటివ్ గా తేలారు. వీరిలో, రాజ్యసభ సెక్రటేరియట్ మొత్తం 915 మందికి పరీక్షలు చేయగా, వారిలో 271 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఆదివారం మధ్యాహ్నం, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా హైదరాబాద్‌లో కరోనాకు గురైనట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్విట్టర్లో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం వారు ఇలా చెప్పారు: “హైదరాబాద్‌లో ఉన్న ఉపరాష్ట్రపతి, ఎం వెంకయ్య నాయుడుకు ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ఒక వారం పాటు స్వీయ-ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనను కలిసిన వారంతా కూడా పరీక్షించుకోవాలని ఆయన కోరారు.”
2021 మధ్యలో రెండవ వేవ్ సమయంలో రాజ్యసభ ఛైర్మన్ కూడా కరోనావైరస్ కు గురయ్యారు. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని, సిబ్బంది, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న సచివాలయ అధికారులకు అన్ని సహాయాలు అందేలా చూడాలని ఉపరాష్ట్రపతి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఇంకా, కరోనా కేసులను తగ్గించడానికి రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు, సిబ్బంది హాజరుపై ఆంక్షలను మళ్లీ విధించింది. తాజా ఆదేశాల ప్రకారం, అండర్ సెక్రటరీ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి కంటే తక్కువ ర్యాంక్ ఉన్న 50 శాతం మంది అధికారులు, సిబ్బంది ఈ నెలాఖరు వరకు ఇంటి నుండి పని చేయాల్సి ఉంటుంది. వారు మొత్తం ఉద్యోగులలో 65 శాతం మంది ఉన్నారు.
వికలాంగులు, గర్భిణీ స్త్రీలకు కార్యాలయానికి హాజరు నుండి మినహాయింపు ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం, రద్దీని నివారించడానికి సచివాలయం ప్రారంభ, ముగింపు సమయాలలో మార్పులు చేశారు.
ముఖ్యంగా, 2020లో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కరోనా ప్రోటోకాల్‌ల ప్రకారం జరిగిన మొదటి పూర్తి సమావేశాలు. ప్రతి రోజు మొదటి సగం రోజు పాటు రాజ్యసభ సమావేశం, రెండవ సగం రోజులో లోక్‌సభ సమావేశం జరిగాయి. 2021లో బడ్జెట్ సమావేశాలలో కూడా మొదటి భాగంలో ఇదే పద్దతిని అనుసరించారు.
గత సంవత్సరం బడ్జెట్, వర్షాకాలం, శీతాకాల సమావేశాలతో పాటు బడ్జెట్ సమావేశాల రెండవలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలు సాధారణ రీతిలో జరిగాయి. అయితే సభ్యులు సంబంధిత సభల ఛాంబర్లు, గ్యాలరీలలో కూర్చున్నారు.
కరోనా మహమ్మారి మూడవ వేవ్ సమయంలో భారతదేశంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఒక వారంలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కఠినమైన కరోనా ప్రోటోకాల్‌లతో జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, జనవరి 4 నుండి 8 వరకు, రాజ్యసభ సెక్రటేరియట్‌లోని దాదాపు 65 మంది, లోక్‌సభ సెక్రటేరియట్లో 200 మంది, అనుబంధ సేవల్లో 133 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయి.