నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారి ముందు తలవంచేందుకు నిరాకరించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. నేతాజీ 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఇండియా గేట్ వద్ద హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తూ, త్వరలో హోలోగ్రామ్ విగ్రహం స్థానంలో గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగలమని చెప్పారు.
నేతాజీ విగ్రహం ప్రజాస్వామ్య విలువలను, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
“స్వతంత్ర భారతావని కలపై విశ్వాసం కోల్పోవద్దు, భారతదేశాన్ని కదిలించగల శక్తి ప్రపంచంలో ఏదీ లేదు” అని నేతాజీ చెప్పేవారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
“ఈ రోజు మనం స్వతంత్ర భారతదేశపు కలలను నెరవేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము. స్వాతంత్య్రం వచ్చిన 100వ సంవత్సరం, 2047లోపు కొత్త భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాము” అని ప్రధాని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టే అవకాశం మన ప్రభుత్వానికి లభించడం తన అదృష్టం అని పేర్కొన్నారు.
దేశానికి సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ నివాళులు అర్పిస్తూ ఇంతకుముందు విపత్తు నిర్వహణను వ్యవసాయ శాఖ నిర్వహించేదని, తమ ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ ను బలోపేతం చేసిందని ప్రధాని తెలిపారు. విపత్తు నిర్వహణ రంగంలో మన కార్యక్రమాలను అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రశంసించాయని గుర్తు చేశారు.
“మేము సంస్కరణపై దృష్టి పెట్టడంతో పాటు ఉపశమనం, రెస్క్యూ, పునరావాసంపై దృష్టి పెట్టాము. మేము ఎన్డిఆర్ఎఫ్ ను ఆధునీకరించాము, దానిని దేశవ్యాప్తంగా విస్తరించాము. ప్రణాళిక, నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతికత, ఇతర అత్యుత్తమ పద్ధతులు అవలంభిస్తున్నాము” అని ప్రధాని వివరించారు.
ఈ సందర్భంగా, 2019, 2020, 2021 మరియు 2022 సంవత్సరాలకు గానూ “సుభాస్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం” లను ప్రధాని ప్రదానం చేశారు. ఈ వేడుకలో మొత్తం ఏడు అవార్డులను ప్రదానం చేశారు.
విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం, నిస్వార్థ సేవలను గుర్తించి, గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం వార్షిక అవార్డును ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద సంస్థలకు రూ.51 లక్షల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, వ్యక్తులకు రూ.5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేశారు.
స్వాతంత్య్ర పోరాటానికి బోస్ చేసిన అపారమైన కృషికి ఈ విగ్రహం తగిన నివాళి అని, దేశం ఆయనకు ఋణపడి ఉండేందుకు చిహ్నంగా ఉంటుందని ప్రధాని మోదీ రెండు రోజుల ముందు చెప్పారు.
28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు కలిగిన ఈ హోలోగ్రామ్ స్టాచ్యూ 30వేల ల్యూమెన్స్ 4కె ప్రొజెక్టర్ తో పనిచేస్తుంది. పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్ ను సందర్శకులకు కనిపించని విధంగా ఏర్పాటు చేశారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్రం ఏడాది పాటు వేడుకలు నిర్వహిస్తోంది.