జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం రైసీ జిల్లాలో యాత్రీకులతో ప్రయాణం చేస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించాగా, 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యాత్రీకులతో శివ్ ఖోరి కేవ్ మందిరానికి వెళ్తుండగా ఈ దాడికి గురైంది.
ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సు లోయలోకి పడిపోయిందని రైసీ సీనియర్ ఎస్పి మోహితా శర్మ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్టు వెల్లడించారు. శివఖోరీ ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
బుల్లెట్లు బస్సు డ్రైవర్ విజయం ను లక్ష్యంగా చేసుకున్నాయని, దానితో అతను వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దాని కారణంగా అది రోడ్డుపై నుండి తప్పి లోయలో పడిపోయిందని నిఘా వర్గాలు తెలిపాయి.ఘటన జరిగిన రోడ్డుపై కనీసం 20 రౌండ్ల ఎకె-47, ఎం4 కార్బైన్లు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన పౌనిలోని తెర్యాత్ గ్రామంలోని స్థానికులు వెంటనే యాత్రికులను రక్షించడం ప్రారంభించారు.
సంఘటన స్థలంలో పారామిలిటరీ, సైన్యం సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే పోలీస్లు, సైన్యం, పారామిలిటరీ బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని పోలీస్లు చెప్పారు. రాజౌరి, పూంచ్, రియాసి ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు పోలీస్లు అనుమానిస్తున్నారు.
సరిహద్దు జిల్లాలు రాజౌరీ, ఫూంచ్ జిల్లాతో పోలిస్తే రైసీ జిల్లాలో ఉగ్రవాద కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి జిల్లాలో ఉగ్రదాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. మృతుల్ని ఇంకా గుర్తించలేదని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి, చికిత్స ఆందిస్తున్నామని రైసీ జిల్లా విశేష్ మహజన్ తెలిపారు.