సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ మార్క్‌ను అందుకోలేకపోయిన బీజేపీ (240 స్థానాలు), త్వరలో వివిధ రాష్ర్టాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి సవాల్ ఎదురవుతుందని భావిస్తున్నది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న 5 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారు.
ఆదివారం 71 మందితో మంత్రివర్గం ఏర్పాటుచేయగా, ఇందులో 21 మంది మంత్రులు (30 శాతం పదవులు) అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ర్టాల నుంచి ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు 2024, 2025లలో ఎన్నికలు రాబోతున్నాయి.
హర్యానా, మహారాష్ట్ర, బీహార్‌లో ఎన్డీయేకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. కీలక రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు మోదీ సర్కార్‌కు సవాలేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేగాక ఈ రాష్ర్టాల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి.
మరోవంక, ప్రధాని మోదీ నేతృత్వంలో 2019-24 టర్మ్‌లో పనిచేసి, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన కొత్త మంది నేతల పేర్లు తాజా క్యాబినెట్లో కనిపించకపోగా.. ఇదే సమయంలో ఓడిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
మోదీ రెండో ప్రభుత్వంలో కీలకమైన ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ నుంచి విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో ఆయనకు చోటుదక్కలేదు.
మరోవైపు ఇటీవల బీజేపీలోకి వచ్చిన పంజాబ్ నేత రవ్నీత్ సింగ్ బిట్టుకు లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా క్యాబినెట్లో చోటు కల్పించారు. ఆయన పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు. సిక్కుల ప్రాబల్యం ఉండే ఆప్ పాలిత పంజాబ్‌లో పార్టీ బలోపేతానికి బీజేపీ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
గత ప్రభుత్వంలో పనిచేసి, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్ మురుగన్‌కు మాత్రమే ఈసారి మంత్రి పదవి అవకాశం దక్కింది. ఓడిపోయిన స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్‌లను పక్కనబెట్టిన విషయం తెలిసిందే.
అటు లోక్‌సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ ఎంపీగా లేని కేరళ బీజేపీ నేత జార్జి కురియన్‌కు క్యాబినెట్ బెర్త్ కేటాయించారు. కేరళలో తొలిసారిగా ఎంపీ స్థానం గెలుచుకొన్న బీజేపీ.. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లడంతోపాటు క్రిస్టియన్ మైనార్టీలకు చేరువయ్యేందుకు గత మూడు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న జార్జి కురియన్‌కు మంత్రి పదవి ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.