ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
2019లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో తెగతెంపులు చేసుకున్న తర్వాత పార్టీ పటిష్టంపై మాయావతి దృష్టిసారించారు. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. గత ఏడాది డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా అతడ్ని ఎంపిక చేశారు.
కాగా, ఈ ఏడాది మే నెలలో మాయావతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి, వారసుడిగాను ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బీఎస్పీ నేతలు ఆశ్చర్యపోయారు.
మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు దక్కించుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మరోసారి జాతీయ సమన్వయకర్తగా నియమించడంతోపాటు తన వారసుడిగా మాయావతి ప్రకటించారు.