పద్దెనిమిదవ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. సోమ, మంగళవారం లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని తరువాత 26న లోక్‌సభ స్పీకరు ఎన్నిక జరగనుంది. 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు.
సోమవారం రాష్ట్రపతి భవన్లో లోక్‌సభ ప్రొటెం స్పీకరుగా మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. మహతాబ్ తర్వాత పార్లమెంటు హౌస్‌కు చేరుకుని ఉదయం 11 గంటలకు లోక్‌సభను ప్రారంభిస్తారు. 18వ లోక్‌సభ తొలి సమావేశం సందర్భంగా ఇటీవల మరణించినవారికి సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించడంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దీని తరువాత లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను సభ టేబుల్‌పై ఉంచుతారు. లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకరు భర్తృహరి మహతాబ్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత లోక్‌సభ నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
తరువాత ప్యానెల్ ప్రొటెం స్పీకర్లు కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్), టిఆర్ బాలు (డిఎంకె), రాధా మోహన్ సింగ్ (బిజెపి), ఫగ్గన్ సింగ్ కులస్తే (బిజెపి), సుదీప్ బందోపాధ్యాయ (టిఎంసి)లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి, తరువాత రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో తదుపరి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
జూన్ 26న స్పీకరు ఎన్నిక జరిగే వరకు సభా కార్యకలాపాలను నిర్వహించడంలో ప్రొటెం స్పీకరు మహతాబ్‌కు సహకరించేందుకు సీనియర్ లోక్‌సభ సభ్యులను కొడికున్నిల్ సురేష్, టి.ఆర్. బాలు, రాధా మోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే, సుదీప్ బంద్యోపాధ్యాయను రాష్ట్రపతి నియమించారు.
లోక్‌సభ స్పీకరు పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత ప్రధాని తన మంత్రి మండలిని సభకు పరిచయం చేస్తారు. జూన్ 27న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జూన్ 28న చర్చ ప్రారంభమవుతుంది. జులై 2, 3న చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారు. కొన్నిరోజుల విరామం తర్వాత జులై 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం మళ్లీ సమావేశాలు జరుగుతాయి.