ఈ నెల 2వ తేదీన హథ్రాస్ జిల్లాలో సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో వందలాది మంది మృతి చెందారు. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దేవ్ ప్రకాష్ మధుకర్ ఈ ఘటన జరగబోయే కొద్దిరోజుల ముందు కొన్ని రాజకీయ పార్టీల నేతలతో టచ్‌లో ఉన్నట్లు తన కాల్ రికార్డ్ చెక్ చేస్తే తెలిసిందని పోలీసులు తెలిపారు.
ఈ కాల్ డేటా ఆధారంగా ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, దేవ్‌ప్రకాష్ మధుకర్‌ని శుక్రవారం రాత్రి ఢిల్లీలోని నజాఫ్‌గడ్ ప్రాంతంలో హథ్రాస్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అరెస్టు చేశారు. హథ్రాస్ తొక్కిసలాట ఘటన జరగబోయేముందు కొన్ని రాజకీయ పార్టీలు దేవ్ ప్రకాష్‌ని సంప్రదించాయని హథ్రాస్ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిపున్ అగర్వాల్ తెలిపారు.
సూరజ్‌పాల్ అలియాస్ భోలేబాబా సత్సంగ్ కార్యమ్రాల కోసం మధుకర్ నిధుల సమీకరణదారుగా పనిచేశారని, విరాళాలు సేకరించారని అగర్వాల్ చెప్పారు. అతని ఆర్థిక లావాదేవీలు, మనీట్రయల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాల్ వివరాల రికార్డులను కూడా తనిఖీ చేస్తున్నారని అగర్వాల్ పేర్కొన్నారు.
వైద్య చికిత్స కోసం వచ్చిన మధుకర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పోలీసులకు లొంగిపోయాడని అతని తరపు న్యాయవాది ఎపి సింగ్ పేర్కొన్నాడు. శనివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం హథ్రాస్‌లోని బాగ్లా జిల్లా ఆసుపత్రికి భారీ బందోబస్తు మధ్య పోలీసులు మధుకర్‌ని తీసుకొచ్చారు. అతను ఆ సమయంలో ముఖానికి రుమాలు కట్టుకున్నాడు. హథ్రాస్‌లోని సికంద్రరావు పోలీస్ స్టేషన్లో హథ్రాస్ ఘటనకు సంబంధించి మధుకర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఏకైక నిందితుడు కూడా ఇతనే అని పోలీసులు తెలిపారు.