హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు. రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ గెలుపొందారు. 45 మంది ఎమ్మెల్యేల ఓట్లతో విశ్వాస పరీక్షలో నెగ్గారు.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. ఇందులో అధికార కూటమిలోని జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 42 మంది సభ్యుల మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్ మార్కు 38కి తగ్గింది. జేఎంఎంకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగానే సోరెన్ విశ్వాస పరీక్షలో నెగ్గేశారు.
ఇక విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు తెలుస్తోంది. గతవారం రాజ్‌భవన్‌లో హేమంత్ సోరెన్ ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ జనవరి 31న హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఐదు నెలల అనంతరం జూన్ 28న హేమంత్ సోరెన్‌కు హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.
దీంతో ఈ నెల 3 జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఈ నెల 5న జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తిరిగి బాధ్యతలు చేపట్టారు.