గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుల మధ్య కొద్దికాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విబేధాలు ప్రస్తుతం బహిరంగం అవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఈ మధ్య కాలంలో బిజెపిపై బహిరంగంగా పోరాటం ప్రారంభించడం, గవర్నర్ ఇదివరకు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు కావడంతో సహజంగానే వారిద్దరి మధ్య దూరం పెరగడానికి దారితీస్తుంది.
బుధవారం గవర్నర్ ప్రసంగించిన రిపబ్లిక్ దినోత్సవంకు ముఖ్యమంత్రి గైరాజరు కావడం రాజకీయంగా చాలా అనూహ్యంగా పరిశీలకులు భావిస్తున్నారు. పైగా మంత్రులెవ్వరు సహితం పాల్గొనక పోవడం భవిష్యత్ లో చెలరేగనున్న రాజకీయ దుమారాన్ని వెల్లడి చేస్తున్నది. ఆమె ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదింపలేదని కూడా తెలుస్తున్నది.
గణతంత్ర దినోత్సవానికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉత్సవాన్ని రాజ్‌భవన్‌కు పరిమితం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం కూడా డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం, సీఎం కేసీఆర్ కూడా హాజరు కావడం గమనార్హం. అప్పుడు లేని కరోనా భయం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది.
ఇదివరకు ఉన్న కాంగ్రెస్ హయాంలో నియమితుడైన గవర్నర్ నరసింహన్ కేసీఆర్ తో చాల సన్నిహితంగా ఉండేవారు. కేసీఆర్ మాటకే ప్రాధాన్యత ఇస్తూ, తన పట్ల చులకనగా వ్యవహరించేవారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాపోయేవారు. చివరకు కాంగ్రెస్ నేతలు సహితం ఆయన కేసీఆర్ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేసేవారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆయనను కొనసాగించినా, ఆయనకు కేంద్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన పట్ల రాష్ట్ర బిజెపి నేతలు అసహనం వ్యక్తం చేస్తుండేవారు. అయితే ఈ మధ్య వరకు కేంద్రంతో కేసీఆర్ సంబంధాలు సవ్యంగా ఉంటూ ఉండడంతో డా. తమిళశై గవర్నర్ గా పనిచేసిన రెండేళ్లు పెద్ద సమస్యలు ఏర్పడలేదు.
అయితే కరోనా సమయంలో ఆమె స్వయంగా వైద్య సదుపాయాల గురించి సమీక్ష చేయడం, నిమ్స్ ను సందర్శించడం, తన సలహాలు పాటించడం లేదని అసహనం ప్రకటించడం ఒక విధంగా ప్రభుత్వ ధోరణి పట్ల ఆమె సంతృప్తికరంగా లేరని వెల్లడి చేస్తుంది. అదీగాక, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లతో ఆమె నేరుగా సమీక్షలు జరపడం కూడా కేసీఆర్ ప్రభుత్వకు అసంతృత్తి కలిగించెడిది.
ఈ మధ్య గవర్నర్ తరచూ కేంద్ర ప్రభుత్వ పధకాలను, ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడం అధికార పక్షం నేతలలో అసంతృప్తికి కారణం అవుతున్నది.
యూనివర్సిటీల వీసీల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆమె సూచించడం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని..అనేక సందర్భాల్లో ఆమె పేర్కొనడం, ముఖ్యమంత్రికి తెలియకుండా వివిధ శాఖల వివరాలను గవర్నర్ తెప్పించుకోవడం కారణంగా రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది.
మరోవంక, ప్రజా సమస్యలపై తనకు ఫిర్యాదులు వస్తున్నాయని ఇందుకోసం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నట్టు గవర్నర్ చేసిన ప్రకటన కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు పాడి కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నియమిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నా గవర్నర్ ఆమోదించాక పోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది.
రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అంటూ మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు.