బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, ఆ దేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే విడిచి ఇండియాకు వచ్చారు. తాను ఇండియాకు వస్తున్నట్లు ఆమె అభ్యర్థించారని మంగళవారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. తమకు కొన్ని నిమిషాల ముందే ఆమె ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిపారు.
ఢాకా నుంచి బంగ్లా ఆర్మీకి చెందిన సి -130జె ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎజెఎఎక్స్ పేరుతో ఢాకా నుంచి టేకాఫ్ అయి, కోల్‌కతా మీదుగా ఢిల్లీకి సమీపంలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హిండన్ ఎయిర్ బేస్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీల సురక్షిత కస్టడీలో ఉన్నారు.
బంగ్లా ఆర్మీ హెలికాప్టర్ మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారత సరిహద్దు వద్ద అతి తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు మన రాడార్లు గుర్తించాయి. భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే విమానంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుని భారత్ రాడార్ వ్యవస్థ విమానంపై నిఘా పెంచింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రెండు రాఫెల్ యుద్ధవిమానాలను రక్షణగా పంపాయి.
”బంగ్లాదేశ్‌తో ఉన్న భారత సరిహద్దు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఎజెఎఎక్స్ 1431 అనే కాల్ గుర్తుతో కూడిన సి-130 ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారతదేశం పర్యవేక్షించడం ప్రారంభించింది. అది ఢిల్లీ వైపు వెళుతోంది. బంగ్లాదేశ్ వైమానిక దళం విమానం సాయంత్రం 4 గంటలకు పాట్నాను దాటి యుపి-బీహార్ సరిహద్దుకు చేరుకుంది.” అని అధికారులు తెలిపారు.
షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేవరకు ఆమె భారత్‌లో ఉండేందుకు న్యూఢిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ సమయంలో హసీనాకు భారత్ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. గత రెండు వారాలుగా అల్లర్ల కారణంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐక్యరాజ్యసమితి నేతత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే, ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్దిఖీ ప్రస్తుతం లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం యూకేలో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు, బంగ్లాదేశ్‌లో నెలకొన్న కల్లోల పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. దీనిపై చర్చించేందుకు అఖిలపక్షం సమావేశమైంది. బంగ్లా సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అటు.. బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల దఅష్ట్యా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేయొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాటిని వ్యాప్తి చేస్తే రాష్ట్రంలో అసమ్మతి, అశాంతి రగిలే ప్రమాదం ఉందని హెచ్చరించింది.