జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచాడు. క్వాలిఫయర్ రౌండ్ లో టాప్‌లో నిలిచి గోల్డ్ మెడల్‌పై ఆశలు రేకెత్తించాడు నీరజ్. ఫైనల్లో క్వాలిఫయర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసిన గోల్డ్ మెడల్ మాత్రం దక్కలేదు. సిల్వర్ మెడల్‌తోనే సరిపెట్టుకున్నాడు.
సిల్వర్ మెడల్ గెలవడం ద్వారా వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకం సాధించిన మూడో ఇండియన్ అథ్లెట్ గా నీరజ్ చోప్రా నిలిచాడు. గతంలో రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాల్ని సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు.
గురువారం అర్థరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 89.45 దూరం జావెలిన్‌ను విసిరాడు. ఫైనల్లో ఐదు సార్లు జావెలిన్‌ను విసరడంలో నీరజ్ విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.45 దూరం విసిరి పతకం ఖాయం చేశాడు.ఆ తర్వాత నీరజ్ ప్రయత్నాలన్నీ ఫౌల్ అయ్యాయి.
టాప్‌లో నిలవడంతో అతడికే గోల్డ్ ఖాయమని అభిమానులు భావించారు. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 92.97 దూరం విసిరి నీరజ్ గోల్డ్ ఆశలను ఆవిరిచేశాడు.
ఒలింపిక్ చరిత్రలోనే అత్యధిక దూరం జావెలిన్ ను విసిరిన ఏకైక, తొలి ప్లేయర్‌గా అర్షద్ నదీమ్ రికార్డ్ నెలకొల్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నార్వే జావెలిన్ త్రోయర్ ఆండ్రీస్ 90.97 దూరం జావెలిన్‌ను విసిరి రికార్డ్ సృష్టించాడు. ఇదే ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో అత్యుత్తమం కావడం గమనార్హం.
అతడి రికార్డును గురువారం ఫైనల్లో అర్షద్ రెండు సార్లు అధిగమించాడు. రెండో ప్రయత్నంలో 92.97 దూరం జావెలిన్‌ను విసిరిన అర్షద్…మరోసారి కూడా 90 మీటర్ల దూరాన్ని దాటాడు. 1992 ఒలింపిక్స్ తర్వాత దాదాపు 32 ఏళ్ల అనంతరం పాకిస్థాన్‌కు గోల్డ్ మెడల్ అందించాడు అర్షద్ నదీమ్. అంతే కాకుండా ఈ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ గెలిచిన ఏకైక పతకం కూడా ఇదే కావడం గమనార్హం.