అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ శనివారం విడుదల చేసిన డాక్యుమెంట్‌పై మరోసారి దేశంలో రాజకీయ దుమారం రేగింది. అదానీ గ్రూపు కంపెనీల్లో భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్‌కు, ఆమె భర్తకు రహస్య వాటాలు ఉన్నాయని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అంటూ ఎక్స్‌లో పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఈ బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే, ఈ ఆరోపణలను ఒక వంక అదానీ గ్రూప్, మరోవంక, మాధవి పురి బచ్ తీవ్రంగా ఖండించారు. సెబీ విశ్వసనీయతను దెబ్బతీయడంతో పాటు దాని చైర్పర్సన్ వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్ సంస్థ ప్రయత్నిస్తున్నదని అంటూ బచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ స్కామ్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ కోరింది. అదానీ కుంభకోణంపై దర్యాప్తు సంస్థగా ఉన్న సెబీ చీఫ్‌పై కూడా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ మొత్తం వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో బచ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సమగ్ర దర్యాప్తు జరిగే వరకు సెబీ చీఫ్‌గా మాధవి బచు తప్పుకోవాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
హిండెన్‌బర్గ్ ఆరోపణలను సెబీ చీఫ్ మాధవి పురీ బచ్, ఆమె భర్త ధావల్ ఖండించారు. ప్రైవేటు వ్యక్తులుగా తాము ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ ప్రమోట్ చేసిన ఫండ్‌లో పెట్టుబడులు పెట్టామని, మాధవి బచ్ సెబీలో పూర్తికాల సభ్యురాలిగా చేరడానికి రెండేండ్ల ముందు ఇది జరిగిందని తెలిపారు. భారత్‌లో పలు ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వని ఆ సంస్థ.. ఈ విధంగా ఎదురుదాడి చేస్తున్నదని ప్రకటనలో పేర్కొన్నారు.
హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను అదానీ గ్రూపు ఖండించింది. సెబీ చీఫ్ మాధవి పురీ బచ్‌తో తమ సంస్థకు ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని తెలిపింది. హిండెన్‌బర్గ్ కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నదని కొట్టిపారేసింది. వ్యక్తిగత లాభం కోసం వక్రీకరణలు చేస్తూ మదుపరులను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నదని తెలిపింది.
మరోవైపు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై తగిన విచారణ జరిగిందని, మాధవి పురీ బచ్ ఎప్పటికప్పుడు వివరాలను బహిర్గతం చేస్తూనే ఉన్నారని సెబీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని సెబీ జారీ చేసిన నోటీసులకు స్పందించడానికి బదులు ‘సెబీ చైర్మన్ మాధాబి పురీ బుచ్’ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడాన్ని సీనియర్ న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు మహేశ్ జెఠ్మలానీ తప్పుబట్టారు.
భారత స్టాక్ మార్కెట్లను అస్థిర పరిచేందుకే హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసిందని ఆరోపించారు. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల్లో కొత్త దనమేమీ లేదని ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై సీరియస్ అటెన్షన్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.