అత్యంత శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాల విభజన కసరత్తు జరిగిందని ప్రణాళిక శాఖ చెబుతున్నా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హడావుడిగా, కేవలం ఒక రోజు వ్యవధిలో జిల్లాల విభజన పూర్తి కావించి, రాత్రికి రాత్రి జీవో విడుదల చేయడం, అందులో వందకు పైగా దోషాలు ఉన్నట్లు కనుక్కొని మరుసటి రోజు మరో రెండు జీవోలు వసూలు చేయడం విస్మయం కలిగిస్తున్నది.
ఈ మొత్తం కసరత్తు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన మరుసటి రోజునే జరగడం గమనిస్తే, వారు ప్రభుత్వం ముందుంచిన సమస్యలను పరిష్కరింపలేక, వారి నిరసనల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ కసరత్తు అంతా హడావుడిగా చేశారని భావింపవలసి వస్తున్నది. ఈ సందర్భంగా పదే, పదే మార్పులు చేయడం గమనిస్తే లోతయిన అధ్యయనం, ఆలోచనలు లేకుండానే చేసిన్నట్లు స్పష్టం అవుతున్నది.
కొత్త జిల్లాలపై రెవెన్యూ శాఖ అందించిన నివేదిక వేరు. 25వ తేదీ రాత్రి పొద్దు పోయాక మంత్రులకు ఆన్లైన్లో అందిన కేబినెట్ నోట్ వేరు. అర్ధరాత్రి దాటాక ఒకదాని తర్వాత ఒకటిగా జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్లు వేరు! ప్రతి దానిలోనూ మార్పులూ, చేర్పులు జరిగాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తీసుకున్న ఫైలుకు, గెజిట్ నోటిఫికేషన్లకు చాలా తేడా ఉన్న విషయం వెలుగుచూసింది. మంత్రివర్గం ఆమోదానికీ, గెజిట్ నోటిఫికేషన్ విడుదలకూ మధ్య ఉన్నతస్థాయిలో మళ్లీ మార్పులు, చేర్పులు చేసినట్లు తెలుస్తున్నది. ఈ కసరత్తులో మంత్రులను సహితం విశ్వాసంలోకి తీసుకోలేదని వెల్లడి అవుతున్నది.
24వ తేదీన ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. అదే రోజు సాయంత్రానికే ప్రభుత్వం కొత్త జిల్లాల హడావుడి మొదలు పెట్టింది. 25వ తేదీ రాత్రి కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆన్లైన్లో మంత్రివర్గ ఆమోదం పొందింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక సీఎం జగన్మోహన్రెడ్డి ఆమోదం అనంతరం 26 జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్లను అప్లోడ్చేశారు.
ఆ తర్వాతే అసలు విషయం బయటిచ్చింది. గెజిట్ విడుదలకు ముందు మంత్రివర్గం ఆమోదించిన జిల్లాల పేర్లలో మార్పులు చేశారని తేటతెల్లమైంది. ఈ సందర్భంగా చాల గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కొన్ని పేర్లను అటు, ఇటు మరుసటి రోజు మార్చవలసి రావడం గమనార్హం.
తమకు పంపిన ఫైలులోని సమాచారం తెల్లారేసరికి చాలామటుకు మారిపోయిందని మంత్రులు సహితం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత లేకుండా, కనీసం మంత్రులు, అధికారులు లోతుగా అధ్యయనం చేయకుండా ఇంత హడావుడిగా జిల్లాల విభజన ఎందుకు చేయవలసి వచ్చిందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లాల మధ్య సరికొత్త జలవివాదాలు
ఇలా ఉండగా, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియని ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో జలవనరుల పంపకం సంక్లిష్టమయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. జిల్లాల మధ్య ఇప్పటికే నెలకొన్న వివాదాలకు తోడుగా సరికొత్త వివాదాలు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, సాగర్ నీటి విడుదల విషయంలో ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య సమస్యలు ఉన్నాయి.
రేపటి రోజున మూడు జిల్లాలుగా విడిపోతే కాలువలకు నీటి విడుదలలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల ఎగువ ప్రాంతం అంతా కొత్తగా ఏర్పడే గుంటూరు జిల్లాలోకి వస్తుంది. డెల్టా ఆయకట్టు దిగువ ప్రాంతం బాపట్ల జిల్లా పరిధిలో ఉంటుంది. దాంతో వివిధ కాలువల ద్వారా నీటి విడుదల సజావుగా జరగకపోతే రెండు జిల్లాల మధ్యన వివాదాలు ముసురుకొంటాయి.
నాగార్జునసాగర్ కుడికాలువ విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా ఏర్పడే పల్నాడు జిల్లా నుంచి సాగర్ కాలువల ద్వారా సాగు/ తాగునీరు ఇటు గుంటూరు, అటు ఒంగోలు జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది.