పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్.. స్వదేశానికి తిరిగి వచ్చారు. విశ్వ క్రీడల్లో ఊహించిన విధంగా పతకం కోల్పోయిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీ విమానాశ్రయం అవతల భారీగా జమకూడిన అభిమానులు వినేశ్‌కు చాంపియన్ తరహాలో వెల్కమ్ చెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజారిన బాధలో ఉన్న రెజ్లర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు అథ్లెట్లు ఆమెకు స్వాగతం పలికారు.
వాళ్లందరూ తనపై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు ఫిదా అయిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడింది. ‘మీ ప్రేమ ముందు వెయ్యి బంగారు పతకాలైనా తక్కువే’ అని వినేశ్ అంది. పారిస్ నుంచి వినేశ్ శనివారం ఢిల్లీ వచ్చింది. అక్కడ రెజ్లర్లు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
‘చాంపియన్ నీకు స్వాగతం’ అంటూ మెడలో పూల దండ, నోట్ల కట్లు వేసి మరీ అభిమానులు వినేశ్‌కు వెల్కమ్ చెప్పారు. దాంతో, ఒలింపిక్ మెడల్ గెలవలేకపోయాననే బాధ నుంచి ఆమె కాస్త తేరుకుంది. అనంతరం మాట్లాడుతూ మీ అందరికీ ధన్యవాదాలు. నేను చాలా అదృష్టవంతురాలిని అని వినేశ్ చెమర్చిన కళ్లతో అంది. ఆ తర్వాత ఆమె స్వగ్రామమైన బలాలికి వెళ్లింది.
మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.
నిజానికి ఫైనల్స్‌లో ఓడిపోయినా కూడా రజత పతకం ఖాయం అయ్యేదే. శరీర అదిక బరువు కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ నుంచే వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారామె. ఇప్పుడు ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది. తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేశారు.
ఆమె తరఫున భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. ఈ కేసును వాదించడానికి సీనియర్ అడ్వొకేట్, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, మరో న్యాయవాది విదూష్ పత్ సింఘానియాను అపాయింట్ చేసింది.
వీడియో కాన్ఫరెన్స్ వినేష్ ఫొగట్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రతినిధులు ఈ విచారణకు హాజరయ్యారు. వారి వాదనలను స్పోర్ట్స్ ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్ ఆలకించారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించారు. అనర్హత నిర్ణయాన్ని సమర్థించారు. దీనితో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు.