వ్యాపారవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారులపై కూడా ఆ నిషేధం వర్తించనున్నది. కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. అనిల్ అంబానీపై 25 కోట్ల ఫైన్ కూడా వేసింది సెబీ. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ పోస్టు నుంచి కూడా ఆయన్ను తప్పించారు. సెబీ మొత్తం 222 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది.
అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో ఆరోపించింది. ఇందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణాధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. ఆర్ఎఫ్హెచ్ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ, వాటిని యాజమాన్యం ఏమాత్రం ఖాతరు చేయలేదని తెలిపింది. అనిల్ అంబానీ ఆదేశాలతోనే, కీలక అధికారులు కావాలని నిబంధనలను అతిక్రమించారని సెబీ ఆరోపించింది.
2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆర్హెచ్ఎఫ్ఎల్ పలు కంపెనీలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా భారీ ఎత్తున రుణాలు మంజూరు చేసింది. అయితే ఈ కంపెనీలు అన్నీ ఆర్థికంగా అత్యంత బలహీనమైనవి లేదా నష్టాల్లో ఉన్నవి కావడం గమనార్హం. ఇలాంటి సంస్థలకు ఎలాంటి తాకట్టు లేదా సెక్యూరిటీ లేకుండా, ఇంత పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడం ద్వారా అనిల్ అంబానీ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సెబీ గుర్తించింది.
అంతేకాదు అనిల్ అంబానీకి సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఏ లిస్టెడ్ కంపెనీలోనైనా డైరెక్టర్ లేదా కీ మేనేజిరియల్ పర్సనల్ (కేఎంపీ) లేదా మార్కెట్ రెగ్యులేటర్ వద్ద నమోదైన మధ్యవర్తి పొజీషన్ సహా సెక్యూరిటీస్ మార్కెట్‌తో 5 సంవత్సరాల పాటు సంబంధం కలిగి ఉండకుండా తేల్చిచెప్పింది.