పెగాసస్ స్పైవేర్ వ్యవహారం దేశంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభంకు ముందు కేంద్రానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పెగాసస్ ఒప్పందంతో సంబంధమున్నవారిపై చర్యలకు ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది.
ఈ ఒప్పందంకు సంబంధించి న్యూయార్స్ టైమ్స్ ప్రచురించిన కథనం ఆధారంగా న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017లో భారత్ – ఇజ్రాయెల్ మధ్య జరిగిన పెగాసస్ ఒప్పందంపై విచారణ జరపాలని ఆయన పిటీషన్లో పేర్కొన్నారు.
ఈ డీల్‌తో సంబంధమున్న వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. పార్లమెంటు ఆమోదం లేకుండా జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసి ఆ డబ్బు రికవర్ చేసేలా చూడాలని అభ్యర్థించారు.
“ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ సైబర్ వెపన్” పేరుతో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. 2017లో భారత్ – ఇజ్రాయెల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో పెగాసస్ కూడా భాగమేనని బాంబు పేల్చింది.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ రూపొందించిన పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి భారత్ సహా పలుదేశాల్లో అక్కడి ప్రభుత్వాలు విపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులపై నిఘా పెట్టినట్లు నివేదికలో స్పష్టం చేసింది.
గతేడాది తొలిసారి పార్లమెంట్ సమావేశాల ముందే పెగాసస్ వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం. అప్పట్లో పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయంపై కథనాలు ప్రచురించాయి. దేశంలో పెగాసస్ ప్రకంపనలు సృష్టించడంతో అడ్వొకేట్ ఎంఎల్ శర్మతో పాటు ప్రముఖ జర్నలిస్ట్ ఎన్.రామ్ గతేడాది సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ నియమించింది. ఈ కమిటీ ఇటీవలే దర్యాప్తు ప్రారంభించింది.