స్వచ్ఛమైన, పర్యావరణహిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చర్ సొసైటీ 64వ వార్షిక సదస్సులో ప్రధాని తన సందేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. భారత ఆటోమొబైల్ రంగం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ఈ రంగం అధిక ఆర్ధిక వృద్ధికి ఊతం, ఉత్తేజం కల్పించాలని కోరారు.
క్లీనర్, గ్రీనర్ మొబిలిటీ దిశగా ఆటోమొబైల్ రంగం దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఇక ఈ సదస్సులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా రూపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ఈ దిశగా ప్రయత్నాలు సాగితే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే మేటి ఆటో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా మనం ఎదగాలని కోరారు. 2070 నాటికి కార్బన్ రహిత మొబిలిటీకి చేరుకోవాలనే లక్ష్యం సాకారం కావాలంటే ఆటోమొబైల్ రంగంలో వినూత్న ప్రక్రియలను ప్రవేశపెట్టడం కీలకమని చెప్పారు.
కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలతో మనం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లుతున్నామని, పరిశ్రమ వృద్ధికి, నిలకడతో కూడిన వృద్ధికి ఇది కీలకమని పేర్కొన్నారు.