రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదలతో తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్ర బృందానికి వివరించారు. తెలంగాణాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సచివాలయంలోశుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన వరద నష్టం గురించి కేంద్ర బృందానికి మంత్రులు వివరించారు. ఎక్కడెక్కడ నష్టం తీవ్రంగా జరిగిందో చెప్పారు.
పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల గురించి వివరించడంతో పాటు ఆస్తినష్టం జరిగిన తీరును కూడా కేంద్ర బృందానికి సవివరంగా తెలిపారు.వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం రేవంత్ కోరారు.
ఖమ్మం జిల్లా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కార్యాచరణ ప్రణాళిక ఉండాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర బృందం అంతకు ముందు తెలంగాణలో వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసింది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర రెవెన్యూ అధికారులతో చర్చించిన కేంద్ర బృందానికి రాష్ట్రంలో జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం గురించి తెలియజేశారు.
ఏయే ప్రాంతాల్లో వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందో వివరించారు. మానవీయ కోణంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.