భోపాల్ పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.‘‘ ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది…నేను వైద్యుల సంరక్షణలో ఉన్నాను. గత రెండు రోజులుగా నన్ను కలిసిన వారందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
ఆవు మూత్రం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను తగ్గించి, కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని గత సంవత్సరం ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చెప్పారు. ‘‘దేశీ ఆవు గో మూత్రం మనల్ని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను చాలా ఆరోగ్య సమస్యల్లో ఉన్నాను, కానీ నేను ప్రతిరోజూ గో మూత్రం తాగుతాను.గో మూత్రం తాగితే కరోనావైరస్ నివారణ కోసం మరే ఇతర ఔషధం తీసుకోనవసరం లేదు. నేను కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడలేదు.’’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చెప్పారు.
కాగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,09,918 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్ బారిన పడి 959 మంది మృతి చెందారు. అలాగే 2,62,628 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 18,31,268 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రోజువారీ కోవిడ్ పాజిటివీటి రేటు 15.77 శాతంగా నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా 1,66,03,96,227 మంది టీకా తీసుకున్నారు.
ఇలా ఉండగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరులో పాఠశాలలను తెరిచారు. 1 నుంచి 10 తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థుల తరగతుల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు అధికారులు.
కరోనా రూల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించే విషయంపై తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేశారు.