ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి కీలక ముందడుగు పడింది. బీజేపీ మేనిఫేస్టోలోని కీలక అంశం, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో కోరుకుంటున్న జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది.
ఈ కమిటీ కొన్ని నెలల పాటు సమగ్రంగా అధ్యయనం చేసి.. నరేంద్ర మోదీ సర్కార్‌కు గతంలోనే ఒక నివేదికను పంపించింది. తాజాగా ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించి రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఇక జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుత ఎన్డీఏ సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలు చేసి తీరుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలె తేల్చి చెప్పారు.
ఇక గత నెలలో ఎర్రకోట వేదికపై చేసిన స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. సంవత్సరం పొడవునా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని.. వీటి కారణంగా దేశ పురోగతిపై ప్రభావం పడుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడంపై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే కీలక ప్రతిపాదనలు చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమే అని పేర్కొన్న కమిటీ.. తమ అధ్యయనానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఇప్పటికే అందజేసింది.
ముందుగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్న కమిటీ.. అవి పూర్తయిన 100 రోజుల లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత మరో 5ఏళ్లకు ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది.
అయితే మొట్టమొదటిసారి నిర్వహించే ఒకే దేశం ఒకే ఎన్నికకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితిని లోక్‌సభ కాలపరిమితి నాటికే ముగుస్తుందని కోవింద్ కమిటీ తేల్చి చెప్పింది. కమిటీలో జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పేర్కొంది. ఇక జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు అవసరమని కమిటీ తెలిపింది.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎలక్షన్ సామాగ్రి, సిబ్బంది, భద్రతా బలగాలను ప్రభుత్వం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఉమ్మడి ఓటర్ల జాబితా, ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.