ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్మూకశ్మీర్, లడక్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకంటే భిన్నమైన రంగులో చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే, 1963లో చైనాకు పాకిస్థాన్ చట్ట విరుద్ధంగా ఇచ్చిన 5168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని షేక్స్‌గమ్ వ్యాలీని చైనాలో భాగంగా చూపించారు.
1954లో చైనా ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని లేత నీలం రంగు గళ్లలో చూపించారు. చైనా భూభాగాన్ని చూపించడానికి ఉపయోగించిన రంగు కూడా ఇదే. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది.
ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఈ విషయాన్ని బలంగా లేవనెత్తినట్టు చెప్పారు.
డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్‌లో భారతదేశ సరిహద్దులను తప్పుగా చూపిస్తూ ఉండడం సరియైనది కాదని, దీన్ని వెంటనే సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. మ్యాప్‌లను సరిదిద్దే విషయంతో రాజకీయ జోక్యానికి అవకాశం ఉండకూడదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్, కరోనా వైరస్ విషయంలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో మన దేశ మ్యాప్‌ను మర్చిచూపడం కూడా చర్చనీయాంశమైంది.
సక్రమమైన భారతదేశ చిత్రపటాన్ని డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్‌లో పెట్టాలని, తప్పులను సరిదిద్దాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు గత ఏడాది డిసెంబర్ 30, ఈ ఏడాది జనవరి 3, 8 తేదీల్లో భారత ప్రభుత్వం లేఖలు రాసింది. అంతేకాదు ఐక్యరాజ్యసమతి శాశ్వత భారత ప్రతినిధి ఇంద్రమణి పాండే, టెడ్రోస్ అధనామ్ వద్ద ప్రస్తావించారు.