జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రద్దైన ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌పై ఆయన మండిపడ్డారు. కతువా జిల్లాలోని బని అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని ఎన్సీ, కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆజాద్ స్పందించారు. ‘ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాపై నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పీడీపీ పార్లమెంటులో మాట్లాడలేదు. వాటి గురించి నేను మాట్లాడా. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధాని, కేంద్ర హోం మంత్రి చెప్పారు. ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలదు. ఏ రాష్ట్రమూ కాదు’ అని ఆయన తెలిపారు.
కాగా, పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుతున్నందున ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తున్నదని గులాం నబీ ఆజాద్ తెలిపారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధి, పురోగతి కోసం ఓటు వేయాలని ప్రజలను కోరారు. తప్పుడు వాగ్దానాలు, నినాదాలతో దోపిడీకి గురికావద్దని సూచించారు. ‘బని ప్రజలు డీపీఏపీకి ఓటు వేయడం ద్వారా సుసంపన్నమైన, సమగ్ర భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తారని మేం నమ్ముతున్నాం. మేమంతా కలిసి జమ్ముకశ్మీర్‌ను పునర్నిర్మిస్తాం’ అని అని భరోసా ఇచ్చారు.