దేశం విభజనకు కారకుడైన మోహ్హమద్ ఆలీ జిన్నా పేరుతో స్వతంత్ర భారత దేశంలో ఓ టవర్ ఉండడం ఏమిటని బిజెపి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆత్మరక్షణలో పడిన వైసిపి ప్రభుత్వం దానికి జాతీయ జెండా రంగులు వేయవలసి వచ్చింది. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా స్వయంగా ఆ టవర్ ను త్రివర్ణపతాకంలో చిత్రించారు.
భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో గత నెలరోజులుగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పైగా, పేరు మార్చని పక్షంలో తాము దానిపై జాతీయ జెండాను ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ హెచ్చరించడంతో ప్రభుత్వం ఏదో ఒక సర్దుబాటు చర్యకు దిగక తప్పలేదు.
నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను రిపబ్లిక్ దినోత్సవం నాడు అదుపులోకి తీసుకోవాల్సి రావడంతో పరిస్థితులు విషమించి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం గ్రహించిన్నట్లు కనబడుతున్నది.
మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ.. వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు టవర్‌ను త్రివర్ణ పతాకంతో అలంకరించాలని, టవర్‌కు సమీపంలో జాతీయ జెండాను ఎగురవేసేలా స్తంభం నిర్మించాలని నిర్ణయించామని ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా తెలిపారు.
గురువారం జిన్నా టవర్‌లో జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ కావడి మనోహర్ నాయుడు సారధ్యంలో ఎగురవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. అయితే టవర్ పై జాతీయ జెండాను ఎగురవేసే `సాహసం’ వైసిపి నాయకులు చేయలేక పోవడం విస్మయం కలిగిస్తున్నది.
గత డిసెంబర్లో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గౌరవార్థం టవర్ పేరును మార్చాలని బిజెపి రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకుంటే స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేస్తామని పలువురు నాయకులూ హెచ్చరించారు.
గణతంత్ర దినోత్సవ సంఘటన తరువాత, మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ విషయమై బిజెపి- వైసిపి మెంతుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో నిలబడలేక అధికారపక్షం నాయకులు తలవంచుకొని పరిస్థితి ఏర్పడింది.
వైసిపి నేతలు ఈ వివాదాన్ని తెరపైకి ఇప్పుడు తీసుకు వచ్చిన బిజెపి నాయకులపై ఎంతగా ఎదురు దాడి చేసినా, తమకు మద్దతుగా స్థానిక ముస్లింలను సమీకరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బీజేపీ-టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేరు ఎందుకు మార్చులేదని అంటూ మంత్రి వెల్లంపల్లి తదితరులు ఎదురుదాడి చేసినప్పటికీ, బీజేపీ తెరపైకి తెచ్చిన సెంటిమెంటును మాత్రం పక్కదారి మళ్లించలేకపోయారు.