పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్, ముఖ్యమంత్రి మమతా బనెర్జీలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటం నానాటికి తీవ్రరూపం దాలుస్తున్నది. జులై, 2019లో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ధంకర్, మమతాల మధ్య పొసగడం లేదు. తరచూ రాజకీయ వివాదాలు చెలరేగుతున్నాయి.
తాజాగా, తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ ను తొలగించానని మమతా చేసిన ప్రకటన వారిద్దరి మధ్య నెలకొన్న వైరం తీవ్రమవుతున్నట్లు స్పష్టం చేస్తున్నది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రతిరోజూ తనకు `అసభ్యమైన’, `దూషణలతో’ ట్వీట్ లు పెడుతూ తనను `వేధిస్తున్నారు’ అంటూ ఆమె తీవ్రమైన ఆరోపణ చేశారు.
ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఆ విధంగా తాను పంపిన ఒక ట్వీట్ నైనా చూపమని మీడియా సమావేశంలో గవర్నర్ ధంకర్ సవాల్ చేశారు. ఈ విషయంపై సీఎం మమతను మీడియా ప్రశ్నించకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. పైగా, ఇది ప్రజస్వామ్యానికి సవాల్ అని ఆయన ధ్వజమెత్తారు.
ఆమె చెప్పినదానిపై తనకు విశ్వసనీయత లేదని ఆయన కొట్టిపారవేసారు. కాగా, ప్రభుత్వంకు సంబంధించిన ఏ ఫైల్ కూడా తన టేబుల్ పై పెండింగ్ లో లేదని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యలు ఉంటే, సీఎం, ప్రభుత్వమే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
“నేను ప్రతిరోజూ తాజ్ బెంగాల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తాను అన్న ఆమె ప్రకటన 100 శాతం అవాస్తవం” అంటి ఆయన తీవ్రంగా ఖండించారు. తాను దుర్వినియోగం చేసిన ఒక్క ట్వీట్, లేదా ఒక్క పత్రాన్ని నిరూపించాలని… సీఎంకు సవాల్ చేశారు.
కాగా, సీఎం పనితీరు ప్రజాస్వామ్య పాలనకు పెద్ద సవాలుగా మారుతోందని గవర్నర్ నిశితంగా విమర్శించారు. బెంగాల్లో చట్ట నియమాలకు అనుగుణంగా పాలన లేకుంటే తాను రంగంలోకి దిగుతానని గవర్నర్ జగదీప్ ధన్కర్ హచ్చరించారు.