కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అత్యధికులు తనకు మద్దతు తెలిపినప్పటికీ కేవలం తాను హిందువైనందుననే తనను పంజాబ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం చేయలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జక్కర్ ఆరోపించారు.
పంజాబ్ లో కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన సందర్భంగా ప్రస్తుతం ఈ పదవికి పోటీ పడుతున్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీలలో ఎవ్వరికీ పార్టీ ఎమ్యెల్యేల మద్దతు లేదని అంటూ జక్కర్ పార్టీలో కలకలం సృష్టించారు.
కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిష్క్రమించిన తర్వాత పార్టీ అధిష్ఠానం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వీరిద్దరికీ ఎంతమాత్రం మద్దతు కనిపించలేదని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సమయంలో జక్కర్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతుంది.
అభిప్రాయ సేకరణలో తేలిన వివరాల ప్రకారం తనకు అనుకూలంగా 42 మంది ఎమ్‌ఎల్‌ఎలు, సుఖ్జిందర్ రణధవాకు 16 మంది, ప్రెణీత్ కౌర్‌కు 12 మంది, నవజోత్ సింగ్ సిద్ధూకు ఆరుగురు, చన్నీకి ఇద్దరు ఎమ్‌ఎల్‌ఎలు మద్దతు ఇచ్చినట్టు బయటపడిందని ఆయన చెప్పారు.
అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న కసరత్తు నుంచి తన పేరును తొలగించడానికి కారణం తాను హిందువును కావడమేనని సునీల్ జక్కర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి సిక్కు నేత అయితే బాగుంటుందని ఢిల్లీలో కూర్చున్న సలహాదారులు తనకు చెప్పారని పేర్కొంటూ పంజాబ్ లౌకికవాద రాష్ట్రం అని ఆయన గుర్తు చేశారు.
తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వక పోయినప్పటికీ, అత్యధిక ఎమ్‌ఎల్‌ఎలు తనకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తనకు అత్యధిక ఎమ్‌ఎల్‌ఎల మద్దతు ఉన్నప్పటికీ, తనకు కేవలం ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రమే ఇవ్వడం వల్ల తాను అసంతృప్తికి గురయ్యానని వెల్లడించారు. సునీల్ జక్కకర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
తాను హిందువునైనందువల్ల తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించబోమని చెప్పకుండా, తాను ఎమ్మెల్యేను కానందువల్ల, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడం లేదని చెబితే బాగుండేదని పార్టీ అధిష్టానాన్ని ఎద్దేవా చేశారు. ఎంపిక చేసిన దళిత నేత సరైనవాడనుకుంటే, ఆయనకు మద్దతును పార్టీ కొనసాగించాలని స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.